అక్కడ మహిళలను వేధిస్తే ఇక అంతే..
Ens Balu
3
Vizianagaram
2021-02-03 17:41:58
పని చేసేచోట మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠిన శిక్షలు తప్పవని సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ లో భాగంగా పని చేసే చోట మహిళల పై లైంగిక వేధింపుల నిరోధించడానికి 2013 లో ప్రభుత్వం చట్టం చేసిందని, ఈ చట్టం పై అన్ని కార్యాలయాలు, సంస్థలలో అవగాహన కల్పించాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో పని చేసే చోట మహిళల పై లైంగిక వేధింపుల నిరోధక అంతర్గత కమిటీ సమీక్ష సమావేశం జే.సి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ చట్టం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్చంద సంస్థలు, నర్సింగ్ హోం లు, హాస్పిటల్స్ , సేవ, సహకార, విద్య సంస్థల్లో వర్తిస్తుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా, మానసికంగా బాధ కలిగేలా ప్రవర్తించినా, భౌతికంగా శరీరాన్ని తాకినా , మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ప్రవర్తించినా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని అన్నారు. మహిళల పట్ల ఇలాంటి సంఘటనలు జరిగితే నెల రొజూ లోపు ఫిర్యాదు చేయాలని, కొన్ని సార్లు ఫిర్యాదు చేయక పోయినా సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని, రుజువైతే ఈ చట్టం ప్రకారం శిక్షలు అమలు జరపాలని అన్నారు. ఈ చట్టం లోనున్న అంశాలు, శిక్షల పై ప్రతి సంస్థ లోని ఉద్యోగులకు అవగాహన ఉండాలని అన్నారు. ఇలాంటి కేసులను నిరోధించడానికి ప్రతి సంస్థ నందు మహిళా ఉద్యోగులతో ఇంటర్నల్ కమిటీ లను వేయాలని అన్నారు.
ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి తొలుత చట్టం లోని సెక్షన్లు, శిక్షలు తదితర అంశాలను వివరించారు. మహిళల పట్ల అసభ్యకర సంఘటనలు జరిగితే ఫిర్యాదు అందినా లేదా తెలిసిన వెంటనే గోప్యంగానే విచారణ జరపడం జరుగుతుందని, పని చేసే చోటా మహిళల గౌరవానికి భంగం కలగని రీతి లో కేసు ను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. నేర తీవ్రతను బట్టి బదిలీలు, ఉద్యోగం నుండి తొలగించడం, ప్రమోషన్ నిలుపుదల, అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుందని, ఫిర్యాదు చేసిన 60 రోజుల నిండి 90 రోజుల లోపు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యాలయం లో ఈ చట్టం అమలు జరపాలని అన్ని కార్యాలయాలకు సర్కులర్ పంపడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాదికారి వెంకటేశ్వర రావు, డి.పి.ఓ పద్మావతి, దిశా పోలీ స్టేషన్ డి.ఎస్.పి త్రినాద్, పలు శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది హాజరయ్యారు.