మందు బాబులకు సర్కారు చేదువార్త..
Ens Balu
3
Vizianagaram
2021-02-03 17:44:18
విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నిక జరగడానికి 44 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో డ్రై డేలను ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నిక జరిగే ముందు రోజు నుంచే మద్యం దుకాణాలు మూసివేయాలని.. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు తెరవడానికి వీలు లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాలో 13, 17, 21వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాలు, మూసివేయాల్సిన మద్యం, కల్లు దుకాణాలు, బార్ల వివరాలను వెల్లడించారు.
* మొదటి దశలో...
పైన పేర్కొన్న ఉత్తర్వుల మేరకు జిల్లాలో మొదటి దశకు సంబంధించి 11వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 13వ తేదీన ఎన్నిక మరియు కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు బాడంగి, బలిజపేట, బొబ్బలి, గరుగుబిల్లి, గుమ్మలక్షీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రపురం, సాలూరు, సీతానగరం, తెర్లాం మండలాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలి.
* రెండో దశలో...
జిల్లాలో రెండో దశ ఎన్నికకు సంబంధించి 15వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 17వ తేదీన ఎన్నిక మరియు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, విజయనగరం మండలాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలి.
* మూడో దశలో...
జిల్లాలో మూడో దశకు సంబంధించి 19వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 21వ తేదీన ఎన్నిక మరియు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, గంట్యాడ, బొండపల్లి, జామి, ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలో ఉండే మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలి.