ఎన్నికల నిర్వహణకు శిక్షణ అవసరం..


Ens Balu
2
Srikakulam
2021-02-03 18:14:59

ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు శిక్షణాకార్యక్రమాలు దోహదపడతాయని శిక్షణా కార్యక్రమ సమన్వయకర్త, విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు పేర్కొన్నారు.  బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయితీ సాధారణ ఎన్నికల నిర్వహణపై స్టేజ్ -2  ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల మాస్టర్ ట్రైనీలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై  ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనీలు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించి ఎన్నికల అధికారులకు ఎటు వంటి సందేహాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో శిక్షణను ఇవ్వాలని తెలిపారు. ఓటింగ్ సమయంలో  అభ్యర్థి  ఎపిక్ కార్డు తప్పని సరిగా తీసుకు వెళ్ళాలన్నారు.  డ్రైవింగ్ లైసెన్స్, వంటి ఐడెంటీ కార్డులు వుండాలన్నారు.  అభ్యర్ధులు ప్రచారం నిమిత్తం ఖర్చు చేసే  ఎన్నికల వ్యయాన్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో బుక్ చేయాలన్నారు. ప్రచార నిమిత్తం  ప్రైవేటు వ్యక్తుల అనుమతితో మాత్రమే ఇంటిపై జెండాలు కట్టడం, స్లోగన్స్ వ్రాయడం వంటివి చేయాలన్నారు. దీనికి అయిన ఖర్చును కూడా ఎన్నికల వ్యయం క్రింద బుక్ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతీ అంశం చాలా ముఖ్యమైనదన్నారు.  ఎన్నికల నియమావళిని ప్రతీ అంశంలోను తప్పక పాటించాలని,   నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ తెలిపారు.  కౌంటింగ్ సమయంలో స్టేషనరీ సామగ్రిని సిధ్ధంగా వుంచుకోవాలన్నారు.  కౌంటింగ్ ఏజెంటు, అభ్యర్ధులను కౌంటింగ్ టేబుల్ వద్దకు అనుమతించవచ్చునని చెప్పారు. ముందుగా వార్డు మెంబర్ల  కౌంటింగ్ జరగాలన్నారు. అనంతరం సర్పంచ్ ల బ్యాలట్ పేపర్ల కౌంటింగ్ చేయాలన్నారు. పి.ఓ.లు తప్పనిసరిగా డెయిరీని   ఖచ్చితంగా నిర్వహించుకోవాలని తెలిపారు.  ముందుగా చెల్లని ఓట్లను విడగొట్టాలని, వాటిని వేరే బండిల్ లో చుట్టి ఒక దగ్గర వుంచాలని తెలిపారు.  దీని వలన ఓట్ల లెక్కింపు త్వరతిగతిన పూర్తి అవుతుందన్నారు.  బ్యాలట్ పేపర్ వెనుక డిస్ట్రుబ్యూషన్ మార్క్, ప్రిసైడింగ్ ఆఫీసరు సంతకం తప్పనిసరిగా వుండాలన్నారు.  రి-కౌంటింగ్ అవసరమైతే ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని వివరించారు. మాస్టర్ ట్రైనీలు  ఈ అవగాహనా కార్యక్రమంలో చక్కగా అవగాహన పొందాలన్నారు. మాస్టర్ ట్రైనీలు తిరిగి ట్రైనింగ్ క్లాసులను నిర్వహించి శిక్షణ పొందే అధికారులకు  అన్ని విషయాలను క్షుణ్ణంగా అవగాహన కల్పించాలన్నారు.                         ఈ శిక్షణా కార్యక్రమానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి.శాంతి, బి.సీతారామ మూర్తి, ఎం.అప్పారావు, విజిలెన్స్ అధికారి ఆర్.వెంకట రమణ, మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు.