వీధి వ్యాపారులకు సుస్థిర జీవనోపాది..
Ens Balu
5
కాకినాడ
2021-02-03 18:36:34
కేంద్ర ప్రభుత్వ పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వానిధి) పథకం కింద లబ్ధిదారులను గుర్తించేందుకు, పథకం ప్రయోజనాలు అందించేందుకు స్వానిధీ సే సమృద్ధి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో జేసీ (డీ) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్.. పీఎం స్వానిధి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 లాక్‌డౌన్ వల్ల ప్రతికూల ప్రభావానికి గురైన వీధి వ్యాపారులకు తిరిగి సుస్థిర జీవనోపాధిని కల్పించాల్సిన అవసరముందన్నారు. నగరాలు/పట్టణాల్లోని అర్హులైన లబ్ధిదారులు, వారి కుటుంబాలను గుర్తించేందుకు వలంటీర్, సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. పీఎం స్వానిధి లబ్ధిదారులకు ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన, రూపే కార్డుల జారీ; ప‌్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన; భవన, ఇతర నిర్మాణ కార్మికుల రిజిస్ట్రేషన్; ప్రధానమంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్ యోజన, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, జననీ సురక్షా యోజన, ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఆర్థిక సేవలు; కార్మిక, ఉపాధి కల్పన; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; మహిళా, శిశు సంక్షేమ విభాగాల పరిధిలోని పథకాల ద్వారా పీఎం స్వానిధి లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించనున్నట్లు వివరించారు. పీఎం స్వానిధి లబ్ధిదారుల గుర్తింపు సర్వే, పథకాల లింకేజీ కార్యకలాపాల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా స్థాయి కమిటీ కూడా పనిచేస్తోందని వెల్లడించారు. 2021, ఫిబ్రవరి 1-6 మొదలు ప్రతి నెలా మొదటి వారంలో శిబిరాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. తొలిగా కాకినాడలో గాంధీనగర్‌లోని మునిసిపల్ హైస్కూల్ ప్రాంగణం, రేచర్లపేటలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మెప్మా పీడీ కె.శ్రీరమణి, డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వరరావు, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డీఈవో ఎస్.అబ్రహాం, ఐసీడీఎస్ పీడీ డి.పుష్పమణి తదితరులు హాజరయ్యారు.