కోవిడ్ 19 టీకా పూర్తి సురక్షితమైంది..
Ens Balu
3
Kakinada
2021-02-03 18:41:04
కోవిడ్-19 టీకా పూర్తిగా సురక్షితమైందని.. ఎలాంటి అపోహలకు తావు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జీజీహెచ్‌లోని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో రెండో దశ టీకా వేసే కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బుధవారం నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల ఫ్రంట్‌లైన్ సిబ్బందికి టీకా పంపిణీ జరుగుతోందన్నారు. తొలి డోసు వేసుకున్నాక మళ్లీ 28వ రోజున రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుందని, దీనికి 14 రోజుల తర్వాత ఇమ్యూనిటీ వస్తుందని వివరించారు. టీకా గురించి అనవసర భయాందోళనలు వీడి.. ఆరోగ్యకర సమాజానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని మెడికల్ కళాశాలల విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, కలెక్టరేట్ సిబ్బంది, కాకినాడ నగర పాలక సంస్థ ఉద్యోగులు తదితరులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని వివరించారు. ఎవరికైనా జ్వరం, చిన్నపాటి దద్దుర్లు వంటివి వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనవసర భయాన్ని వీడి టీకా వేయించుకోవాలని సూచించారు. అనంతరం జేసీ.. కోవిడ్ టీకా వేయించుకున్న వారితో నేరుగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన ఎనిమిదివేల మాస్కులను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ వైడీ రామారావు.. జాయింట్ కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. అరుణ, కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.