నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి..
Ens Balu
2
Kakinada
2021-02-04 18:11:55
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన 767 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి హాజరయ్యారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు పలు సూచనలు చేశారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత ఈ మూడు దశల్లో పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఏ చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, శిక్షణ సమయంలో రిసోర్స్ పర్సన్లు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో తు.చ. తప్పకుండా పాటించాలని సూచించారు. గతంలో ఎన్నికల సిబ్బందిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణ అంటే ప్రతిసారీ సవాలే అని అందువల్ల ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. చెక్‌లిస్ట్‌కు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, పేపరు సీల్స్ తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని.. ఏవైనా సందేహాలుంటే ముందే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని.. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లాలో పర్యటించి, ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. ప్రణాళిక ప్రకారం స్టేజ్-1, స్టేజ్-2 అధికారుల శిక్షణ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. అత్యంత కీలకమైన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరు అయిన అధికారులు, సిబ్బందికి షోకాజు నోటీసులు అందించనున్నట్లు జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎస్.మధుసూధన్, రిసోర్స్ పర్సన్ జగ్గారావు, పీవోలు, ఏపీవోలు హాజరయ్యారు.