ఇంధన పొదుపు అందరి బాధ్యత..
Ens Balu
5
Srikakulam
2021-02-05 14:01:11
ఆర్టీసీ బస్సుల ఇంధన సామర్ధ్యం పెంచి, ఇందనాన్ని పొదుపు చేయడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఆర్.టి.సి డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.వరలక్ష్మీ సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్.టి.సి 1వ డిపోలో ఇంధన పొదుపు మాసోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం బస్సుల ఇంధన సామర్ధ్యం 5.48గా ఉందని, ఆ సామర్ధ్యాన్ని మరింత పెంచే దిశగా సిబ్బంది కృషిచేయాలని కోరారు. ప్రతీ డ్రైవరు సురక్షిత ప్రయాణానికి అవసరమైన పంచ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఏక్సిలేటరును జాగ్రత్తగా వాడాలని, కంటి చూపుతూనే బ్రేకును వినియోగించాలని చెప్పారు. బస్సు నిర్ధిష్టమైన వేగాన్ని అందుకున్న తదుపరి ఏక్సిలేటర్ పవర్ పాయింటుతో నడపాలని అన్నారు. ఇంజిన్ స్పీడ్, వాహనం స్పీడ్ మేచ్ అయ్యేవిధంగా చేసే విధానాన్ని పవర్ పాయింట్ విధానం అని అంటారని, ప్రస్తుతం వచ్చిన కొత్త బస్సులన్నింటికీ ఈ విధానం వర్తిస్తుందన్న సంగతిని ఆమె గుర్తుచేసారు. ఏటవాలు రోడ్లపై, మలుపులు ముందు ఏక్సిలేటర్ పెడలుపై పాదాలను పూర్తిగా తీసివేయాలని ఆమె సూచించారు. ప్రతీ స్టేజీకి, స్పీడ్ బ్రేకర్లను ముందుగానే గుర్తించి ఏక్సిలేటర్ వాడకాన్ని నిలిపివేయాలని ఇటువంటి కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం వలన ఇంధన సామర్ధ్యం పెరుగుతుందని, ఈ విషయాన్ని వాహనం నడిపే ప్రతీ డ్రైవరు గుర్తెరగాలని పిలుపునిచ్చారు. ఇంధనం చాలా విలువైందని, ఇంధనం పొదుపులోనే ఆదాయం ఉందని, కావున డ్రైవర్లు కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేపట్టి ఇంధనం పొదుపు చేయాలని ఆమె కోరారు.
గతేడాది కరోనా కారణంగా బస్సులు నిలిపివేయడం వలన ఆదాయం తగ్గిందని, ప్రస్తుతం జాతీయ రహదారుల విస్తరణ 98 శాతం పూర్తయినందున నష్టపోయిన ఆదాయాన్ని పూర్తిచేసేలా డ్రైవర్లు, మెకానిక్ లు, శ్రామిక్, సూపర్ వైజర్లు కృషిచేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంధన సామర్ధ్యం పెంచడంలో విశేష సేవలు అందించిన డ్రైవర్ కె.రాజారావు, మెకానిక్ కె.జె.రావు, జయదేవ్, టైర్ మెకానిక్ రామ్మోహన్, గేరేజ్ సూపర్ వైజర్ జి.వి.కె.రాజు, ఇంధన పొదుపులో ప్రధాన భూమిక పోషించిన ఈశ్వరరావులకు డెప్యూటీ సిటిఎం బహుమతులను అందజేసి అభినందనలు తెలిపారు. ఆర్.టి.సి 1వ డిపో మేనేజర్ వి.ప్రవీణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, శ్రీకాకుళం సేల్స్ మేనేజర్ ప్రియాంక, డ్రైవర్లు, సూపర్ వైజర్లు, మెకానిక్ లు, శ్రామిక్ , ఆర్.టి.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.