ఎన్నికల్లో జోనల్ అధికారుల పాత్ర కీలకం..
Ens Balu
3
Vizianagaram
2021-02-05 14:31:47
ఎన్నికల ప్రక్రియలో జోనల్ అధికారుల పాత్ర చాలా కీలకమని, అందరి అధికారులతో, సిబ్బందితో సమన్వయంగా వ్యవహరిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉందని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై జోనల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జోనల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలు సందేహాలను నివృత్తి చేశారు. జోనల్ అధికారులు ఇటు జిల్లాస్థాయి అధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులతో సమన్వయంగా వ్యవహరించాలని, ప్రతి అంశంపైనా అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆర్‌వోలతో, ఏఆర్‌వోలతో, రూట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన తాజా అంశాలపై జిల్లా కేంద్రానికి సమాచారం ఇవ్వాలని, ఎన్నిక ముగిసిన తర్వాత పూర్తి వివరాలతో కూడిన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వీలైనంత మేర సాధ్యమైనన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని, అక్కడ పరిస్థితులపై సమాచారం అందించాలని హితవు పలికారు. జోనల్ అధికారులకు ఎక్జిక్యూటివ్ మరియు మెజిస్ట్రీయల్ అధికారులు ఉంటాయి కాబట్టి ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే పోలిస్ అధికారులతో కూడా సంప్రదించి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఉపదేశించారు. ఎన్నిక ముందు రోజు నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు జోనల్ అధికారులు జవాబుదారీతనం వహించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో విజయనగరం జిల్లా ఎప్పుడూ మిగతా వారికి ఆదర్శంగానే నిలిచిందని.. ఈ సారి కూడా మనమే అందరికీ ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలంటే జోనల్ అధికారులు ధైర్యంగా ఉండాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. అలాగే నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వ్యక్తిగత అభిప్రాయాలను, పద్ధతులను ఎన్నికలలో జొప్పించరాదని, నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సునీల్ రాజ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో టి.వెంకటేశ్వరరావు, డీఎల్‌డీవో రామచంద్రరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.