ప్రజల కనీస అవసరాలన్నీ తీరుస్తాం..
Ens Balu
3
Vizianagaram
2021-02-05 14:33:30
ప్రజల కనీస అవసరాలన్నిటినీ తీరుస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వం తమదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమూ తమ ప్రభుత్వానికి రెండు కళ్లు అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, దేవాదాయ శాఖామాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం పట్టణంలో పూర్తి చేసిన వివిధ అభివృద్ది పనులను ఆరంభించేందుకు, ప్రారంభోత్సవ మాసోత్సవాలు పేరిట చేపట్టిన వినూతన్న కార్యక్రమానికి మంత్రులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. వివిధ అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాసన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరి కనీస అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో అభివృద్ది పూర్తిగా కుంటుబడిందని, ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. విజయనగరం పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు అప్పట్లో రామతీర్ధసాగర్ ప్రాజెక్టును తెచ్చామని, రాజకీయ కారణాలతో గత ప్రభుత్వ పెద్దలు దీనిని ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి ప్రక్కనబెట్టారని ఆరోపించారు. ప్రజల సమస్యలను, వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోనివారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని మంత్రి బొత్స చెప్పారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా 31 లక్షలమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. తాము కొత్తగా ఊళ్లను నిర్మిస్తున్నామని, దానిలో భాగంగా గుంకలాంలో సుమారు 12వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. తమ ప్రభుత్వానికి అభివృద్ది, సంక్షేమమూ రెండు కళ్లు లాంటివన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలను కేలండర్ ప్రకారం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందని కొనియాడారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ది కోసమే మూడు రాజధానులను ప్రతిపాదించడం జరిగిందన్నారు. గత ఐదేళ్లూ అమరావతి పేరుతో చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని మంత్రి ఆరోపించారు.
విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు. సుమారు 3,648 కిలోమీటర్ల తన సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల కష్టాలను, ఇబ్బందులను అధికారంలో వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి తొలగిస్తున్నారని చెప్పారు. ప్రజలందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారికి ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, దాసన్నపేట ప్రాంతంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత తమదేనని అన్నారు. కేవలం రెండేళ్లలోనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని, ఇంటింటికీ కొళాయిలు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. పట్టణ ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించేందుకు ఏడు చోట్ల రిజర్వాయర్లును నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమారు 15వేల కిలోలీటర్ల నీరు అందుబాటులో ఉందని, కొత్తగా నిర్మించే ట్యాంకుల ద్వారా అదనంగా మరో 5000 కిలోలీటర్ల నీరు అందుబాటులోకి వస్తుందని స్వామి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, మున్సిపల్ ఇంజనీర్ కె.దిలీప్, సూపరింటిండెంట్ ఇంజనీర్ బిహెచ్ శ్రీనివాస్, ఎఎంసి వైస్ ఛైర్మన్ జమ్ము శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఆశపు వేణు, డాక్టర్ విఎస్ ప్రసాద్, ఎస్‌వివి రాజేష్, బొద్దాన అప్పారావు, తవిటినాయుడు తదితర పలువురు నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.