పచ్చదనం పెంపులో భాగస్వాములు కండి..
Ens Balu
2
Vizianagaram
2021-02-07 16:59:35
ప‌్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణపై కూడా శ్రద్ధ వహిస్తే జిల్లాను హరిత వనంగా రూపొందించవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. మొక్కలు, పచ్చదనంతోనే పర్యావరణ సమతుల్యతను కాపాడగలమని పేర్కొన్నారు. హరితవిజయనగరం కార్యక్రమంలో భాగంగా భోగాపురం మండలం రాజాపులోవ గ్రామంలోని ఒలవరాజు చెరువు గట్టుపై మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ నేతృత్వంలో ఆదివారం తెల్లవారుఝామున చేపట్టారు. మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ఉపాధిహామీ వేతనదారులు, రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు, గ్రామస్థులంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని 200 కోనా కార్పస్ మొక్కలను చెరువుగట్టుపై నాటారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతోపాటు అన్ని మొక్కల సంరక్షణకోసం ట్రీగార్డులు ఏర్పాటు చేసి గ్రామస్థులే మొక్కలు పెంపకంలో బాద్యత వహించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తెల్లవారుఝామున చేరుకొని సుమారు గంటకుపైగా మొక్కలు నాటే కార్యక్రమంలో హరిత విజయనగరం బృందం సభ్యులు జిల్లా సామాజిక అటవీ అధికారి జానకిరావు, డా.వెంకటేశ్వరరావు, రామ్మోహన్ తదితరులతో కలసి పాల్గొన్నారు. కార్యక్రమానికి అవసరమైన మొక్కలను అందజేసిన మొదలవలస గ్రామానికి చెందిన వై.కృష్ణ అనే వ్యక్తిని జిల్లా కలెక్టర్ అభినందించారు. భోగాపురం మండల తహశీల్దార్ రాజేశ్వరరావు, ఎంపిడిఓ బంగారయ్య, ఉపాధిహామీ ఏపిఓ ఆదిబాబు, హరిత విజయనగరం సభ్యులు ఎం.రమేష్‌బాబు, వి.నాని, ఎస్.గోపి, వి.సత్యారావు, జిల్లా ఆర్.ఎం.పి. అసోసియేషన్ ప్రతినిధులు గౌరినాయుడు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.