ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతం..
Ens Balu
3
Srikakulam
2021-02-08 19:59:39
శ్రీకాకుళం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మంగళ వారం జరగనున్న మొదటి విడత పోలింగుకు ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతంగా జరిగింది. మొదటి విడత ఎన్నికలు జరనున్న ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల ప్రధాన కేంద్రాలలో మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం నుండి ప్రారంభించారు. విధులకు హాజరు కావలసిన మండలాలకు పోలింగు సిబ్బంది చేరుటకు సోమ వారం ఉదయం 5 గంటల నుండి ఆర్.టి.సి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్ ఇతర అధికారులు సామగ్రి పంపిణీని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అన్న మండలాల్లో పంపిణీ కార్యక్రమం సజావుగా, సక్రమంగా జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఏకగ్రీవాలు మినహాయించగా 282 గ్రామ పంచాయతీలలో పోలింగు జరుగుతుందని ఆయన చెప్పారు. మద్యం దుకాణాలను కౌంటింగు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అభ్యర్ధులు ప్రచార కార్యక్రమాలను 44 గంటలు ముందుగా నిలిపివేయాలని పేర్కొన్నారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డా.కరుణాకర రావు తదితరులు పాల్గొన్నారు.