చక్కగా ఎన్నికల విధులు నిర్వహించాలి..


Ens Balu
2
Anantapur
2021-02-08 20:35:36

అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న తొలివిడత గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కదిరి డివిజన్ లోని నల్ల చెరువు మండలంలో పర్యటించారు.  ముందుగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తిచేసుకుని చేసుకుని భోజనాలు చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు. పంపిణీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భోజన వసతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యాకేజ్డ్ ఆహారమే అందుతోందా, మండల అధికారులు ఉద్యోగులు ఉన్న చోటికే ఆహారం మరియు ఎన్నికల సామాగ్రి అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. భోజన వసతులు బాగున్నాయని ఉద్యోగులు చెప్పినప్పటికీ వారికి అందించిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని పాఠశాల అవరణంలోని మండల వనరుల కేంద్ర భవనంలో రుచి చూసారు.  పోలింగ్ విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో మండల కేంద్రాల్లోని పంపిణీ కేంద్రాల వద్ద మరియు పోలింగ్ కేంద్రాల వద్ద అన్నిరకాల వసతులు కల్పించామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పింఛన్లు అవ్వా, తాతల దగ్గరికి వెళ్లి ఇచినట్టుగా ఉద్యోగుల దగ్గరికే సామాగ్రి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉద్యోగులు కూడా ఓటర్ ఫ్రెండ్లీ ఎన్నికలే ధ్యేయంగా పని చేయాలన్నారు. విజయవంతంగా పోలింగ్ పూర్తి చేయాలని కోరుతూ.. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.  ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ, పబ్లిక్ ఫ్రెండ్లీ ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. పోలింగ్ సమయం పెంపు  పోలింగ్ సమయాన్ని ఉదయం 6.30 గంటల నుంచే మొదలు పెట్టి సాయంత్రం 3.30 గంటల వరకూ కొనసాగిస్తామన్నారు. ఇది గతంలో కేటాయించిన పోలింగ్ సమయం కంటే మూడు గంటలు ఎక్కువన్నారు. అలాగే వలసలు ఎక్కువగా ఉండే కదిరి డివిజన్ లో వారిని తిరిగి రప్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.  పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనంతరం నల్ల చెరువు మండలంలోని ఎర్రగుంట పల్లి(తలమర్ల వాండ్ల పల్లి గ్రామ పంచాయితీ) గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన వసతులు తొందరగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఓటింగ్ ప్రక్రియకు గానీ, ప్రజలకు గానీ చిన్న ఇబ్బంది కూడా రాకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లపై అధికారులను ప్రశ్నించారు. కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు, కేంద్రంలో వసతుల ఏర్పాట్లు పోలింగ్ మొదలయ్యే సమయానికి సిద్ధం చేసుకుని ఉండాలని   కలెక్టర్ ఆదేశించారు.