మావోయిస్టు ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తిచేయాలి..
Ens Balu
2
Kakinada
2021-02-08 20:37:59
ఏజెన్సీలో మావోయిస్టు ప్రభావిత పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందనే విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జిల్లాస్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వర్చువల్ విధానంలో మూడో విడత ఎన్నికలు జరిగే రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల మార్పు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు; పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల వ్యయ పరిశీలన తదితర అంశాలపై సన్నద్ధత ప్రణాళికను 11 మండలాల ఎంపీడీవోల నుంచి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల మార్పుపై అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు. మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపే వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని సూచించారు. దూర ప్రాంతాలు కాబట్టి ఎన్నికల సామగ్రి కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. చివరి క్షణంలో ఇబ్బందులు తలెత్తకుండా రవాణాకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలోరంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, చింతూరు ఐటీడీఏ పీవో ఎ.వెంకటరమణ, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.