ఫేజ్-1లో 10 లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు..
Ens Balu
2
Kakinada
2021-02-08 20:46:23
తూర్పుగోదావరి జిల్లాలో ఫేజ్-1 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంగళవారం అత్యధికంగా సుమారు 10 లక్షల మంది ఓటర్లు పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఫేజ్- 1 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 9 వ తేదీన జరుగు పోలింగ్ ప్రక్రియకు సోమవారం పెద్దాపురం మండలానికి సంబంధించిన మహారాణి కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రిజర్వ్ సిబ్బంది విధుల్లో కొనసాగాలని తెలిపారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు-2021లో భాగంగా జిల్లాలో ఫేజ్ -1 కింద పెద్దాపురం, కాకినాడ డివిజన్లలో 20 మండలాల్లో మంగళవారం ఉదయం 6.30 గంటల నుండి 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఫేజ్-1 ఎన్నికల్లో 366 గ్రామ పంచాయితీలకు గాను 336 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, సుమారు 10 లక్షల మంది ఓటర్లు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఫేజ్ -2 ప్రక్రియకు సంబంధించి ఈరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఫేజ్- 3 కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఫేజ్-1 ఎన్నికల్లో సుమారు 13000 మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించడం జరిగిందని, వీటికి సంబంధించి మైక్రో అబ్జర్వర్లు, విడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ రోజున జాయింట్ కలెక్టర్లు, డివిజనల్ అధికారులు సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందని, పోలీసుశాఖ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిష్పక్షపాత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశానికి ముందు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది హాజరు నమోదు చేసే కౌంటర్ ను, సిబ్బందికి ఏర్పాటు చేసిన టిఫిన్, భోజనం కౌంటర్లను పరిశీలించారు.
ఈ పరిశీలనలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, ఎంపిడివో ఎ.రమణారెడ్డి, తహశీల్దార్ బి.శ్రీదేవి, డీఎల్ పీవో వై. అమ్మాజీ, ఈవోపీఆర్డీ హిమ మహేశ్వరి, పోలింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.