రథ సప్తమి వేడుకల ఏర్పాట్లు పరిశీలన..


Ens Balu
3
Arasavilli
2021-02-10 21:54:23

శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే రథ సప్తమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన జిల్లా కలెక్ట్ జె నివాస్ ఆదేశించారు. రథ సప్తమి వేడుకల ఏర్పాట్లను పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి బుధ వారం సాయంత్రం పరిశీలించారు. రథ సప్తమి వేడుకలు 18వ తేది అర్థ రాత్రి ప్రారంభమై 19వ తేదీ అర్థ రాత్రి వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా సంబంధిత అథికారులతో సమీక్షిస్తూ నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎన్.రమేష్ ను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరం మేరకు జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. ఆలయంలోపల, క్యూ లైన్లలో సైతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ మేరకు ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. భక్తులకు అవసరం మేరకు వైద్య సేవలు అందించుటకు ఏర్పాట్లు చేయాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావును ఆదేశించారు. ఐదు ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న దృష్ట్యా ఆలయం చుట్టు ప్రక్కల, రహదారులపైనా, నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్యను కలెక్టర్ ఆదేశించారు. తాగు నీటి ఏర్పాట్లను సైతం పర్యవేక్షించాలని అన్నారు.           వేడుకలకు ఇంద్ర పుష్కరిణి, క్యూ లైన్లు, ఆలయం చుట్టు ప్రక్కల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నివాస్ మీడియాతో మాట్లాడుత సాధారణ భక్తులకు ప్రశాంతంగా దర్శనం కావడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కోవిడ్ దృష్ట్యా భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఉండటం ఉత్తమమని సూచించారు. పెద్ద వారికి కోవిడ్ త్వరగా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. వి.ఐ.పిలకు పాస్ ఏర్పాటు చేయుటకు యోచిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. వి.ఐ.పిల పేరుతో అధిక సంఖ్యలో వ్యక్తులు వస్తున్నట్లు గత వేడుకలలో కనిపించిందని అన్నారు. వారి వలన వి.ఐ.పిలకు సైతం ఇబ్బందులు ఎదురు అవుతుందని, ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించిన వారికి కూడా దర్శనం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు. పాస్ లు ఏర్పాటు వలన కేవలం వి.ఐ.పి కుటుంబాలు మాత్రమే దర్శనానికి రావడం వలన ఇబ్బంది లేకుండా దర్శనం కలుగుతుందని భావిస్తున్నామని చెప్పారు.           పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శనం కలుగుటకు చర్యలు చేపడుతామన్నారు. ఎన్నికలలో పోలీసు బందోబస్తు ఉంది, రథ సప్తమికి కూడా తగిన బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.           ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.హరిసూర్యప్రకాష్ మాట్లాడుతూ వేడుకలలో పలు స్వచ్చంద సంస్ధలు పాల్గొని సహాయ సహకారాలు అందిస్తాయన్నారు. జిల్లా సత్య సాయి సేవా సంస్ధ భక్తుల సామాన్లు, చెప్పులు భద్రపరచుట, మజ్జిగ, పులిహోరా, తాగు నీటి సరఫరా కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పారు. రథ సప్తమి వేడుకలకు తీసుకున్న చర్యలను వివరించారు.  ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్, డి.ఎస్.పిలు ఎం.మహేంద్ర, సి.హెచ్.జి.వి.ప్రసాద్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ.శ్రీనివాస రావు, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు డి.శ్రీనివాసు, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు గనిరాజు, నగర పాలక సంస్ధ ఇంజనీరు వెంకట్, జిల్ల అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనుబాబు, ఇపిడిసిఎల్ డివిజనల్ ఇంజనీరు పాత్రుడు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, రోటరీ సభ్యలు మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.