ఓటర్లూ పెరుగుతున్న ఎండలను గమనించాలి..
Ens Balu
2
Anantapur
2021-02-11 22:13:23
ఎండలు పెరుగుతున్న దృష్ట్యా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఎండ తీవ్రత పెరగక ముందే ఉదయం వేళల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ఉదయం 6:30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఎండ వేడిమి జరుగుతున్న దృష్ట్యా ఉదయం వేళల్లోనే ప్రజలంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి వల్ల ఎవరూ వడదెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉదయం వేళల్లో ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లాలో నాలుగు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి దశ పూర్తికాగా, మిగిలిన మూడు దశల్లో ధర్మవరం, కళ్యాణదుర్గం, అనంతపురం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లలో ప్రజలు తమ ఓటు హక్కును ఉదయం వేళల్లో వినియోగించుకోవాలన్నారు.