అముల్ అనుసంధానంతో పాల సేకరణ..


Ens Balu
2
Srikakulam
2021-02-12 15:29:21

అముల్ సంస్ధ అనుసంధానంతో రాష్ట్రంలో పాల సేకరణ చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర డైరి అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరక్టర్ ఏ.బాబు తెలిపారు. శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ప్రాజెక్టు వివరాలను తెలియజేసారు. అముల్ సంస్ధ ప్రపంచంలోనే ఖ్యాతి గన్న సంస్ధ అన్నారు. మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సంస్ధ అని పేర్కొంటూ ఒక ఉత్పత్తికి బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పుడు విలువ ఆధారిత ధర పెరుగుతుందన్నారు. అముల్ సంస్ధ పాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా రాష్ట్రంలో ఒక చక్కటి సహకార విధానం రానుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలు సహకార వ్యవస్ధలో భాగస్వామ్యం కానున్నారని చెప్పారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపరచుటకు ఇది బాగా దోహదపడుతుందని తెలిపారు. అముల్ సంస్ధ ఉత్తమ ధరను అన్ని సీజన్లలోనూ చెల్లిస్తుందని బాబు చెప్పారు. కరోనా సమయంలోనూ అముల్ సంస్ధ పాల సేకరణ నిలుపుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు. అముల్ అనేది రైతులు ఏర్పాటు చేసుకున్న సంస్ధ అని రైతులే యజమానులని వివరించారు. అముల్ రైతులు ఆంధ్ర ప్రదేశ్ రైతుల సహకారం తీసుకొనుటకు ముందుకు వచ్చారని చెప్పారు. అముల్ లో అత్యధికంగా మహిళలు భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తో ఒప్పందం మూలంగా రాష్ట్రం నుండి 2.37 మిలియన్ మహిళలు ఈ ఉద్యమంలో చేరుతున్నారని చెప్పారు. పాలను సేకరించి ప్రతి 10 రోజులకు చెల్లింపు చేస్తున్న సంస్ధ అముల్ అని అన్నారు. 10 రోజులకు రూ.21 వేలు ఆర్జిస్తున్న మహిళలు గుజరాత్ లో ఉన్నారని తెలిపారు. అముల్ కు వచ్చే ఆదాయంలో 85 శాతం రైతులకు చెల్లించడం జరుగుతోందని ఆయన వివరించారు. కొన్ని గ్రామాల్లో 65 వేల లీటర్ల సేకరణ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఏడాదికి కోటి రూపాయలను ఆదాయంగా పొందుతున్న మహిళలు ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 75 శాతం అసంఘటిత రంగం (అన్ ఆర్గనైజ్డు) ద్వారా కొనుగోళు జరుగుతుందని చెప్పారు. కేవలం 25 శాతం మాత్రమే సంఘటిత రంగంలో సేకరణ జరుగుతోందని వివరించారు. వీటన్నింటి దృష్ట్యా యంత్రాంగం చిత్తశుద్ధితో, టీమ్ స్పిరిట్ తో పనిచేయడం ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. బ్యాంకర్లు సైతం పాడి ఆవులకు, గేదెలకు సరళంగా రుణాలు మంజూరు చేయడం ద్వారా లబ్దిపొందుతారని సూచించారు. బ్యాంకులకు ఇది మంచి వ్యాపార ప్రణాళిక అవుతుందని చెప్పారు. బహుళ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం వలన అత్యుత్తమ ప్రాజెక్టుగా రూపొందగలదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా గణాంకాలు పరిశీలిస్తే ప్రాజెక్టు విజయవంతం చేయుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో అమలులో ఉందని, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2,774 బల్క్ మిల్క్ చిల్లింగు కేంద్రాలు (బి.యం.సి.యు) మొదటి దశలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, రెండవ దశలో 7,125, మూడవ దశలో 9,899 ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. మొదటి దశలో ఆటోమేటిక్ మిల్క్ కూలింగ్ యూనిట్ కేంద్రాలు (ఏ.యం.యు.సి) 2,123, రెండవ దశలో 8,051 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం ప్రయోగాత్మకంగా అమలు చేయుటకు నిర్ణయించడం జరిగిందని, మార్చి నాటికి వంద గ్రామాల్లో సేకరణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. 2022 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. గ్రామాల్లో పాడి పశువులు కలిగిన ప్రతి కుటుంబ మహిళ మహిళా డైరీ సహకార సంఘం (యం.డి.ఎస్.ఎస్) సభ్యులుగా ఉంటారని వీరిని మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. యం.డి.ఎస్.ఎస్ లో సభ్యులుగా ఉంటూ నిత్యం పాలు పోసే వారిని మేనేజింగ్ కమిటిలో సభ్యులుగా చేర్చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వీటి నిర్వహణకు ప్రామాణిక నిబంధనలు ఉంటాయని చెప్పారు. నాలుగు  ఏ.యం.యు.సిలు ఒక యం.డి.ఎస్.ఎస్ ఉంటాయని చెప్పారు. దీనిపై పాడి పశువులు ఉన్న కుటుంబాల్లో మంచి అవగాహన కలిగించాలని, పేరణ ఇవ్వాలని సహకార శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.       జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 5.72 లక్షల పశువులు, 48 వేల గేదెలు, 7.39 లక్షల గొర్రెల సంపద ఉందన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన పాలసేకరణకు ప్రణాళికలు తయారు చేసామని అన్నారు. రోజుకు 18,518 లీటర్ల పాలు సేకరించగలమని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. అముల్ సంస్దకు చెందిన జి.సి.ఎం.ఎం జనరల్ మేనేజర్ హిమాంశు రాథోడ్ మాట్లాడుతూ అముల్ సంస్ధ 1946లో స్ధాపించడం జరిగిందన్నారు. రూ.24 వేల కోట్ల టర్నోవర్ తో నడుస్తుందని, 26 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. 250 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందని వివరించారు. ప్రతి రోజు రూ.110 కోట్ల విలువ మేర చెల్లింపులు జరుగుతాయని ఆయన చెప్పారు. రైతుల ఆర్ధిక, సామాజిక స్ధితిగతులు మెరుగుపడుట ధ్యేయంగా అముల్ సంస్ధ పనిచేస్తుందని ఆయన వివరించారు. పూర్తి పారదర్శకంగా నడిచే సంస్ధ అన్నారు. అముల్ సంస్ద బనాస్ కట్టా ప్రాంత పాల సేకరణ అధిపతి డా.ప్రఫుల్ భన్వదియ మాట్లాడుతూ గుజరాత్ లో బనాస్ కట్టా ప్రాంతం ఆసియాలో అత్యధిక పాలసేకరణ ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. కోటి రూపాయలు ఆదాయం పొందుతున్న రైతులు సైతం ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, సహాయకలెక్టర్ ఎం.నవీన్, ఆర్.డి.ఓ ఐ.కిశోర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలుకలు డా.ఏ.ఈశ్వర రావు, సహాయ సంచాలకులు డా.మాదిన ప్రసాద్, డా.నారాయణ రావు., జిల్లా సహకార అధికారి కె.మురళీ కృష్ణ మూర్తి, డివిజనల్ అధికారులు బి.నగేష్, రమణమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి హరి ప్రసాద్, డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) అగ్రికల్చర్ కన్సల్టెంట్ పి.వెంకటేశ్వర రావు, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజనీరు భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.