విజయనగరంలో 82% పోలింగ్..
Ens Balu
3
Vizianagaram
2021-02-13 19:37:13
విజయనగరం జిల్లాలో తొలివిడత పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. ఎన్నికల్లో ఓటేసేందుకు జిల్లా ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని చూపారని, ఉదయం 6.30 గంటలకే పోలింగ్ బూత్‌లవద్ద పెద్ద సంఖ్యలో జనం క్యూలైన్లలో ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో జరిగిన తొలివిడత ఎన్నికల్లో సగటున 82శాతం ఓటింగ్ నమోదయ్యిందని తెలిపారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 355 గ్రామ పంచాయితీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో, మొత్తం 5,67,589 ఓట్లకు గానూ, 4,65,631 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అత్యధికంగా రామభద్రాపురం మండలంలో 86.3 శాతం, అత్యల్పంగా గుమ్మలక్ష్మీపురంలో 73శాతం ఓటింగ్ నమోదయ్యిందని వివరించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన అధికార యంత్రాంగానికి, పోలీసులకు, సహకరించిన జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.