కోవిడ్19 విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులు సస్పెన్షన్ ..


Ens Balu
4
Srikakulam
2020-08-16 17:35:23

కోవిడ్ విధులలో నిర్లక్ష్యం వహించే వారిని జిల్లా యంత్రాగం తీవ్రంగా పరిగణిస్తోంది. వీరఘట్టాం మండల కేంద్రంలో గ్రామ సచివాలయం -2 లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల విధులు నిర్వహించాల్సిన ఇంజనీరింగు సహాయకుడు జి.వెంకటేష్ విధులకు హాజరు కానందున సస్పెన్షన్ చేయగా, తనకు అప్పగించిన పంచాయతీల క్లష్టర్లలో విధులకు హాజరు కాని  క్లష్టర్ సర్వేలియన్స్ అధికారి, బిటివాడ వెటర్నరీ  అసిస్టెంట్ సర్జన్ పి.చైతన్య శంకర్ ను  సస్పెన్షన్ చేసారు. ఈ మేరకు వార్డు, గ్రామ సచివాలయాలు, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ అయిన ఇద్దిరితోపాటు క్లష్టర్ సర్వేలియన్స్ అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఓ) జి.పైడితల్లి సక్రమంగా పర్యవేక్షక విధులు నిర్వహించని కారణంగాను., ఇఓ పి.ఆర్.డి, పంచాయతీ కార్యదర్శి మరియు సచివాలయం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి పి.రాజ్ కుమార్ తమకు కేటాయించిన క్లష్టర్లలో సర్వేలియన్స్ పనులలో పర్యవేక్షణలో లోపం కారణంగా షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. కోవిడ్ విధులకు నియమించిన అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు. కోవిడ్ విధులను బాధ్యతతో, విద్యుక్త ధర్మంతో నిర్వహించి ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ విధులను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వద్దని ఆదేశాలు జారీ చేస్తున్నా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండటం విచారకరమని ఆయన అన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో రేయింబవళ్ళు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసామని, అవి విధిగా రేయింబవల్ళు పనిచేయాల్సిందేనని  శ్రీనివాసులు తెలిపారు. ప్రతి క్షణం అప్రమత్తత అవసరమని పేర్కొంటూ ప్రతి ఇంటిలో ఫీవర్ సర్వే జరగాల్సిందేనని, కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశించారు. ఆసుపత్రిలో కనీసం వారం రోజుల పాటు చికిత్స పొందే పరిస్ధితి ఉండాలని చెప్పారు. ఇళ్ళలో చివరి క్షణాల వరకు కరోనా లక్షణాల వ్యక్తులు ఉంటే అందుకు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులదే బాధ్యత అని స్పష్టం చేసారు. ప్రజలు కూడా తమకు లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వాలంటీరుకు, సచివాలయంలో ఏర్పాటు చేసిన  కంట్రోలు రూమ్ కు తెలియజేసి సహాయం పొందాలని కోరారు. కరోనా వివక్ష ఉంటుందనే ఆలోచనతో ప్రాణాల మీదకు తెచ్చుకోరాదని ఆయన పిలుపునిచ్చారు. వివక్ష చూపే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు చిన్నవిగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం వలన కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా ఇంటికి చేరవచ్చని సూచించారు. అధికారులు, సిబ్బంది ఇచ్చిన సూచనలు ప్రజలు పాటించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని అన్నారు.