ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు..


Ens Balu
3
Srikakulam
2021-02-13 22:50:00

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపు కొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి, వంగర మండలాల్లో శనివారం జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ జె.నివాస్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్తో కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేసారు. అనంతరం పలాస మండలం పెదంచల , వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం, కవిటి మండలం మాణిక్యపురం గ్రామాలతో పాటు పలు మండలాలను ఎస్.పి అమిత్ బర్ధార్ తో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలోని 236 గ్రామ పంచాయితీలకు, 2,448 వార్డులకు ఎన్నికలు జరిగాయని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పలాస మండలం బొడ్డపాడులో నూతన దంపతులైన తామాడ రమేష్, సింధు తమ ఓటును వేసి ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు  ధర్మల్ చెకప్ తో పాటు చేతులకి  శానిటైజర్ చేయడం జరిగిందని అన్నారు. తొలి విడత మాదిరిగానే రెండవ విడతలో కూడా జిల్లా అధికారులను, పోలీసు సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. మధ్యాహ్నం 3.30గం.ల వరకు జరిగిన పోలింగులో  72.87 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు.