సంజీవయ్య యువతకు స్ఫూర్తిదాయకం..
Ens Balu
3
Srikakulam
2021-02-14 20:56:01
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. సంజీవయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని పాలకొండ రోడ్ లో ఉన్న సంజీవయ్య పార్కులో దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవయ్య నిరాడంబరుడని, రాజనీతిజ్ఞతకు మారుపేరుగా నిలిచారని ఆయన అన్నారు. సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించి ఆదర్శప్రాయమైన రాజకీయాలు అందించారని పేర్కొన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు సంజీవయ్య ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దామోదరం సంజీవయ్య ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, విలువలకు కట్టుబడి బతికిన అతి కొద్దిమంది రాజకీయనాయకుల్లో ఒకరని నేటితరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నో పదవులు నిర్వహించిన సంజీవయ్యకు చనిపోయే నాటికి ఆస్తిపాస్తులు లేవంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోకూడదన్న నియమానికి కట్టుబడ్డ నేత సంజీవయ్య అని పేర్కొన్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన నిజాయితీని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. నిస్వార్ధ రాజకీయ జీవితాన్ని అనుభవించిన వ్యక్తి అని అన్నారు. బహుబాషలలో ప్రావీణ్యము కలిగిన వ్యక్తి అన్నారు. సంజీవయ్య పేరున విశాఖపట్నంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నెలకొల్పడం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ కు, సంజీవయ్య పార్కు అభివృద్ధిలో శ్రద్ద వహించిన నగర పాలక సంస్ధ కమీషనర్ నల్లనయ్యకు అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ తైక్వాండో శ్రీను, విశ్రాంత డిప్యూటి కలెక్టర్ పి.ఎం.జె బాబు, వివిధ సంఘాల నాయకులు పి.చంద్రపతి రావు, బోసు మన్మధరావు, పొన్నాడ రుషి, కంఠ వేణు, డా.జామి భీమ శంకర రావు, ఎస్.వి.రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.