రెండు విడతల ఎన్నికలు ప్రశాంతం..


Ens Balu
3
Srikakulam
2021-02-14 20:58:12

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీల రెండు విడతల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. సంజీవయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆది వారం నగరంలోని పాలకొండ రోడ్ లో ఉన్న సంజీవయ్య పార్కులో దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు విడతలు ప్రశాంతంగా, సజావుగా పూర్తి అయ్యిందన్నారు. మూడు, నాలుగవ విడతలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగు సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మొదటి విడతలో 75.77 శాతం పోలింగు జరిగిందని, రెండవ విడత 72.87 శాతం పోలింగు జరిగిందని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన 236 గ్రామ పంచాయతీల ఫలితాలు వెల్లడించామని అన్నారు. మూడవ విడతలో 293, నాలుగవ విడతలో 274 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వ్యవసాయ సీజన్, వలసలు వెళ్ళడం వలన పోలింగు శాతం తగ్గిందని బావిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మూడు, నాలుగవ విడతల ఎన్నికల్లో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఓటు అన్నారు. అటువంటి విలువైన ఓటు హక్కును వృధా చేయరాదని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. పోలింగు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 1.30 నాటికి ముగుస్తుందన చెప్పారు.