ఆక్రమణలు తొలగించిన జీవిఎంసీ..
Ens Balu
3
Gangavaram
2021-02-14 21:23:03
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 5వ జోన్ లో బాల చెరువు రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు జివిఎంసి కమిషనర్ వి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. గాంధీ జంక్షన్ నుంచి గంగవరం పోర్టు జంక్షన్ వరకు గల మార్గాన్ని రెవెన్యూ శాఖ, ఐలా ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, సర్వేయర్ గంగవరం పోర్ట్ అధికారులతో కలిసి జాయింట్ సర్వే ఈ నెల 11వ తేదీన నిర్వహించి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు కు కావలసిన ప్రాంతము కొంతవరకూ ఉన్న ఆక్రమణలు పూర్తిగా జెసిబీలతో తొలగించారు. ముఖ్యంగా గంగవరం పోర్టు ప్రహరీ గోడ కూడా ఆ క్రమంలో నిర్మించినట్లు అధికారులు గుర్తించి, గోడ తో పాటు ఉన్న అన్ని ఆక్రమణలను 5వ జోన్ లోని పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. ఇదివరకే ఆ ప్రాంతంలో గల ఐలా ప్రతినిధులు, పెదగంట్యాడ పారిశ్రామిక సంఘం వారు మాస్టర్ ప్లాన్ పరంగా రోడ్డు వెడల్పు, సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు గాను నిరసనలు తెలుపుతూ ఈ రోడ్డు అభివృద్ధి వలన ట్రాఫిక్ నియంత్రణ జరిగి, ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక పెట్టుబడులు అభివృద్ధి చెందుతాయని పలుమార్లు ఆందోళన చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి తో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ వ్యాపారస్తులకు న్యాయం చేస్తామని చెప్పిన దరిమిలా, వివిధ శాఖలకు చెందిన అధికారులు స్పందించి, ఆక్రమణలు తొలగించుటకు తగు చర్యలు చేపట్టినందుకు అక్కడగల పారిశ్రామిక ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్ అభివృద్ధి వలన ట్రాఫిక్ నియంత్రణ తో పాటు, పారిశ్రామిక ప్రాంతానికి గాని, గంగవరం పోర్ట్ కు వెళ్లడానికి సమయాభావం తగ్గుతుందని, ఉపాధి అవకాశాలు పెరిగి పారిశ్రామిక వాడలో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని ఆ ప్రాంతానికి చెందిన ఇండిస్టియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.