ఎన్నికల సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయాలి..


Ens Balu
4
Kakinada
2021-02-14 21:35:00

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 17వ తేదీన రంపచోడవరం, ఎటపాక డివిజన్ల పరిధిలో  గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రవాణా, ఆహారం, వసతి పరమైన సమగ్రమైన ఏర్పాట్లతో ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి  డివిజనల్, మండల అధికారులను ఆదేశించారు.  ఆదివారం మద్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాలు నుండి జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి ఐటిడిఏ పిఓలు, డివిజనల్, మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మూడవ దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆదేశాలు జారీచేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి రెండు దశల ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారులు, సిబ్బంది తక్కవ సంఖ్యలో హాజరు కావడం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఆలస్యంగా రావడం వంటి అంశాలను గమనించామని,   ఏజెన్సీ మండలాల్లో జరుగుతున్న మూడవ దశ ఎన్నికల సందర్భంగా ఇటువంటి లోపాలు  పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.   ఎన్నికల సిబ్బంది సుదూర మండలాల్లో విధులకు సకాలంలో చేరుకోవలసి ఉన్నందున, వారందరూ 15వ తేదీ సాయంత్రానికే ఆయా మండలాలకు చేరేందకు వీలుగా మైదాన మండలాల్లోని 13 ప్రదేశాల నుండి 15వ తేదీ ఉదయం 8-00 గం.లకు బయలుదేరేట్లు 106 ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.    మైదాన మండలాల నుండి మూడవ దశ ఎన్నికల విధులు కేటాయించిన సుమారు 5,300 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మైక్రో అబ్జర్వర్లు 15వ తేదీ ఉదయం 7-30 గంటల లోపు ఆయా బస్టాండులకు చేరుకుని సంబంధిత మండల విద్యాశాఖాధికారికి రిపోర్టు చేయాలని తెలిపారు.   13 ప్రాంతాల నుండి బయలు దేరిన ఉద్యోగులను తొలుత రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజి వద్ద ఏకత్రం చేసి, మద్యాహ్న భోజన అనంతరం వారి వారి రూట్లలో ఏర్పాటు చేసిన బస్సులలో విధులు నిర్వహించాల్సిన మండలాలకు తీసుకువెళ్లాలని, అక్కడి హాస్టళ్లలో రాత్రి బస, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని అధికారులకు సూచించారు.  16వ తేదీ ఉదయం అల్పాహారం అనంతరం పోలింగ్ సామాగ్రితో ఉద్యోగులను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి వారి వారి పోలింగ్ కేంద్రాలకు తరింలించాలన్నారు.  17వ తేదీన పోలింగ్ ప్రక్రియను కచ్చితంగా మద్యాహ్నం 1-30 గం.లకు ముగించాలని, 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభించి సాయంత్రం 6-30 గం.లలోపు పూర్తి చేయాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను తప్పని సరిగా వెబ్ కాస్టింగ్, అది వీలు కాని చోట్ల వీడియో కెమేరాల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించారు.   ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం భోజనం, రవాణా సౌకర్యాలతో ఉద్యోగులు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లే ఏర్పాట్లు చేపట్టాలని, ఎటువంటి అసౌకర్యానికి లోను కుండా చూడాలని డివిజనల్, మండల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, డిపిఓ ఎస్.వి.నాగేశ్వరనాయక్, జడ్పి సిఈఓ ఎన్ వివి సత్యన్నారాయణ, డిఈఓ ఎస్ అబ్రహాం, డిటిసి ప్రతాప్, ఆర్టిసి ఆర్ఎ పాల్గొని ఆయా అంశాల ఏర్పాట్లను డివిజన్, మండల అధికారులకు వివరించారు.   ఎన్నికల విధుల ఉద్యోగుల రవాణా నిమిత్తం 15వ తేదీ ఉదయం 8 గం.లకు ఏర్పాటు చేసిన బస్సులు ఈ ప్రదేశాలల్లోని బస్టాండుల నుండి బయలు దేరతాయిః  1. అమలాపురం బస్ డిపో           ( 11  బస్సులు – ఐనవిల్లి, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, మామడికుదురు, పి.గన్నవరం, ఉప్పలగుప్తం మండలాల ఉద్యోగుల కొరకు)   2. కాకినాడ బస్ డిపో (19 బస్సులు –  కాకినాడ అర్బన్, రూరల్, ఐ.పోలవరం, కాజులూరు,    కరప, పెదపూడి, తాళ్లరేవు మండలాల ఉద్యోగులు) 3. మండపేట బస్ స్టాండ్ (4 బస్సులు -    మండపేట, కపిలేశ్వరపురం మండలాల ఉద్యోగులు) 4. ముమ్మిడివరం యండిఓ ఆఫీసు    (2 బస్సులు – ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల ఉద్యోగులు) 5. పెద్దాపురం బస్టాండ్ (9 బస్సులు – పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట, పెద్దాపురం, రంగంపేట,    సామర్లకోట మండలాల ఉద్యోగులు) 6. పిఠాపురం బస్టాండ్ (7 బస్సులు - పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల ఉద్యోగులు) 7. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి (19 బస్సులు -  రాజమండ్రి అర్బన్, రూరల్, గోకవరం, కడియం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల ఉద్యోగులు) 8. రామచంద్రపురం బస్ డిపో (5 బస్సులు – రామచంద్రపురం, కె.గంగవరం మండలాల ఉద్యోగులు) 9. అనపర్తి బస్ స్టాండ్ (5 బస్సులు – అనపర్తి, రాయవరం, బిక్కవోలు మండలాల ఉద్యోగులు) 10. రావులపాలెం బస్ స్టాండ్ ( 6 బస్సులు – రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల ఉద్యోగులు) 11. రాజోలు బస్ స్టాండ్ (4 బస్సులు – రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల మండలాల ఉద్యోగులు) 12. తుని బస్టాండ్ (9 బస్సులు – తుని, కోటనందూరు, రౌతులపూడి, శంఖవరం, తొండంగి మండలాల ఉద్యోగులు) 13. ఏలేశ్వరం బస్ స్టాండ్ (6 బస్సులు – ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాల ఉద్యోగులు)