దామోదరం సంజీవయ్య మహోన్నత వ్యక్తి..
Ens Balu
2
విజయనగరం
2021-02-14 21:38:50
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రజల మనస్సును గెలిచిన ప్రజా నాయకుడని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ అన్నారు. ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంజీవయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాల్లో కీలక పాత్ర పోషించారని, దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన కష్టపడే మనస్తతత్వమే ఆయన్ని కీర్తి శిఖరాలకు చేర్చిందని పేర్కొన్నారు. ఉద్యోగ జీవితం నుంచి మొదలైన ఆయన ప్రస్థానం రాజకీయ రంగంలో ఓ ఘనుడిగా ఇనుమడించిందని అన్నారు. ఆనాడు ఉన్న క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను దాటి, ఓ బలమైన వర్గాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎదగటం సాధారణ విషయం కాదన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంజీవయ్య పార్కు ఆయన కీర్తి చిహ్నానికి చక్కని చిరునామాగా అభివర్ణించారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దళిత జాతికి ఆయన ఒక వెలుగు జ్యోతి అని కీర్తించారు. దళితులు చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి పిల్లవాడికీ సంజీవయ్య జీవిత చరిత్ర గురించి చెప్పాలని, తద్వారా ఒక స్ఫూర్తిదాయకమైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. సంయుక్త కలెక్టర్ జి.సి. కిశోర్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ జగన్నాధం మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను బ్రతికించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం. గణపతిరావు, పశుసంవర్ధక శాఖ జేడీ ఏవీ నర్శింహులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.