ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి..
Ens Balu
2
Anantapur
2021-02-15 21:04:44
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ ఐసి భవనం నుంచి సోమవారం సాయంత్రం జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది తో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ (రెవెన్యూ & రైతు భరోసా) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మొదటి, రెండో దశ ఎన్నికల కంటే మిన్నగా మూడో దశ గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోలింగ్ అధికారులు నిబంధనల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. చెల్లని ఓట్లు ఏవి, రీకౌంటింగ్ ఎప్పుడు ఎలా చేయాలి లాంటి అంశాల గురించి స్పష్టత లేకపోతే పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి, పోలింగ్ ఏజెంట్ల నుంచి సమస్యలు ఎదురవుతాయన్నారు. పోలింగ్ సరళి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంపై రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు దృష్టి సారించాలన్నారు. గంటకోసారి అందాల్సిన పోలింగ్ సరళి రిపోర్టు 15 నిమిషాల కంటే ఆలస్యం కాకూడదన్నారు. కేవలం పోలింగ్ సమాచారాన్ని అందించడానికే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలని ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డిని ఆదేశించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలోని ఓటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వద్ద పోలీసు వారి సహాయంతో బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే విధానం గురించి పోలింగ్ అధికారులకు వివరించారు. వీలైనంత తొందరగా కౌంటింగ్ పూర్తి చేసి సాయంత్రం 9.30 గంటల లోపు సర్పంచ్ ఎన్నిక, ఉప సర్పంచ్ ఎన్నికను ప్రకటించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు నిబంధనల గురించి స్పష్టత కలిగి ఉండి కాన్ఫిడెంట్ గా వ్యవహరిస్తే ఏజెంట్లు, అభ్యర్థులు సమస్యలు సృష్టించే అవకాశం ఉండదన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ (ఆసరా&సంక్షేమం) ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసుకోవాల్సిన విధానం గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు మండల స్థాయిలో గ్రామ పంచాయితీ వారీగా, పోలింగ్ కేంద్రం వారీగా ఎన్నికల సామాగ్రిని విభజన చేసుకుని పోలింగ్ అధికారులకు పంపిణీ చేయాలన్నారు. ప్యాకేజ్డ్ ఆహారంతో పాటు కనీసం రెండు నీళ్ల బాటిళ్లను ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగులలో అందించాలన్నారు. పోలింగ్ అధికారులకు వారికి అందాల్సిన సామాగ్రి గురించి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి సరిచూసుకునే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్ అధికారులకు విధుల్లో పాల్గొన్నందుకు ఇచ్చే పారితోషికాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే వేస్తున్నందున డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దే అందరి ఖాతాల వివరాల సేకరణ పూర్తి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, జిల్లా పరిషత్ సి ఈ ఓ శోభా స్వరూపరాణి, డిపిఓ పార్వతి, తదితరులు పాల్గొన్నారు.