మార్చి 14 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక..
Ens Balu
6
Kakinada
2021-02-15 21:48:26
తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి మార్చి 14న పోలింగ్ జరగనుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ కలెక్టర్ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్‌పి షేముషి బాజ్‌పాయ్, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబుతో కలిసి కలెక్టర్.. ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల స్టాండింగ్ కమిటీ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన మంగళవారం నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి, 24వ తేదీన పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల ఉప సంపహరణకు ఈనెల 26వ తేదీ ఆఖరు తేదీ కాగా, పోలింగ్ మార్చి 14వ తేదీన ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకు జరుగుతుందన్నారు. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మార్చి 22 తేదీకి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు.
రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్:
ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికలకు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారిగా, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కె.వెంకటరమణ, తూ.గో. జిల్లా డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, ప.గో. జిల్లా డీఆర్‌వో ఎస్.శ్రీనివాసమూర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని తక్షణం పరిష్కరించేందుకు వీలుగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఛైర్మన్‌గా స్టాండింగ్ కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు వివిధ విభాగాల జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఉంటారన్నారు.
ఈ నెల 16 నుంచి నామినేషన్లు:
ఎన్నికల్లో పోటీచేయాలనుకునే అభ్యర్థులు కాకినాడలో జిల్లా కలెక్టరు కార్యాలయంలోని కోర్టు హాలులో ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు అన్ని పనిదినాల్లో ఉదయం 11 గం.ల నుంచి మధ్యాహ్నం 3 గం.ల వరకు తమ నామినేషన్లు ఫారం-2ఈ లో దాఖలు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ శెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. అభ్యర్థి నామినేషన్ తో పాటు ఫారమ్-26లో నోటరీ చేయించిన అఫిడవిట్ సమర్పించాలని, అన్ని కాలమ్ లు విధిగా నింపాలన్నారు. నామినేషన్ ను 10 మంది తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాద్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఓటర్లు ప్రతిపాదించాల్సించి ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఫారమ్ – AA, ఫారమ్-BB సమర్పించాలని తెలిపారు. అభ్యర్థి వయస్సు 30 కంటే తక్కువ ఉండకూడదన తెలియజేశారు.
ఈ నెల 5వ తేదీన ప్రచురించిన తుది జాబితా ప్రకారం తూ.గో. జిల్లా పరిధిలో 9,560; ప.గో. జిల్లా పరిధిలో 7,725 వెరసి మొత్తం 17,285 మంది ఓటర్లు నమోదయ్యారని.. ఇప్పటికీ నమోదుకాని, అర్హులైన ఓటర్లు ఈ నెల 23వ తేదీ లోపు ఫారమ్-19 ధరఖాస్తు ఫైల్ చేసి ఓటర్లుగా నమోదు కావచ్చునని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికల నిర్వహణకు తూర్పు గోదావరి జిల్లాలో 67, పశ్చిమగోదావరి జిల్లాలో 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని.. జిల్లా, డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఈ నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎంసీసీ పర్యవేక్షణకు మెప్మా పీడీని నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. ఫ్లయింగ్, స్టాటిక్ సర్వయిలెన్స్ బృందాలతో చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఎస్‌పీల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ ఫారాల సరఫరా, ఇతర సమాచారం, సామగ్రి అందించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ పనిచేస్తుందన్నారు. ప్రజలు సమాచారం కోసం కాల్ సెంటర్ టోల్ ఫీ నెంబరు 1950ను సంప్రదించవచ్చని తెలిపారు... కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ధ్రువీకరణపత్రాలు ఇవ్వని కారణంగా అర్హత ఉన్నప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోలేక పోయారని బీఎస్‌పీ ప్రతినిధి ఎస్.అప్పారావు తెలియజేయగా.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో బి.వెంకటేశ్ నాయుడు (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), ఎస్.అప్పారావు (బీఎస్‌పీ), ఎ.వెంకటేశ్ (బీజేపీ), ఎం.రాజశేఖర్ (సీపీఎం), జి.సాయిబాబు (టీడీపీ), ఆర్.వెంకటేశ్వరరావు (వైఎస్సార్ కాంగ్రెస్), కాకినాడ కలెక్టరేట్ ఎన్నికల డీటీ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.