ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు..
Ens Balu
3
Kakinada
2021-02-15 21:50:12
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కె.విజయానంద్‌కు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై వెలగపూడి నుంచి సీఈవో కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుంచి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, కాకినాడలోని కలెక్టరేట్ నుంచి డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, మెప్మా పీడీ కె.శ్రీరమణి తదితరులు హాజరయ్యారు. ఓటర్ల జాబితా, క్లెయిమ్‌ల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పెట్టెలు, ఇతర ఎన్నికల సామగ్రి తదితరాలపై సీఈవో పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సీఈవోకు వివరించారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి, శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని పటిష్టంగా అమలుచేస్తామని, ఎంసీసీ అమలు పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్‌పీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్.. సీఈవోకు తెలిపారు.