ఫుల్ జోష్ లో కార్పరేటర్ అభ్యర్ధులు..
Ens Balu
3
Visakhapatnam
2021-02-16 11:41:03
విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలోని కార్పోరేటర్ అభ్యర్ధులు ఫుల్ జోష్ తో ఉన్నారు. ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న జీవిఎంసి ఎన్నికలకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపడంతో ఎన్నికల హడావిడి మొదలైంది. మార్చి 10 విశాఖ జివిఎంసీకి ఎన్నికలు జరుగుతుండగా, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ మేరకు ప్రకటన జారీ చేయడంతో మహానగరంలోని కార్పోరేటర్ అభ్యర్ధులంతా తమ పనిలో బిజీగా మారిపోయారు. ఈ సుమారు పదేళ్ల తరువాత జీవిఎంసీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభ్యర్ధులు తమ స్థానాన్ని, సీటును పదిల పరుచుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారపార్టీ అభ్యర్ధులు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుంటే ప్రతిపక్షం ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్య పరిచే పనిలో పడింది. ఇప్పటికే వివిధ పనులపై రాష్ట్ర, జిల్లా, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. అందులోనూ జివిఎంసీ శివారు వార్డుల్లో నెలకొన్న సందిగ్దతపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో కార్పోరేట్ అభ్యర్ధులు రంగంలోకి దిగిపోయి తమ తమ వార్డుల్లోని ఓటర్లను ప్రశన్నం చేసుకుంటన్నారు. కొందరు నాయకులు గత సంవత్సరం నుంచే వార్డుల్లోని ప్రధాన సమస్యలను గుర్తిస్తూ...వాటి పరిష్కారానికి కూడా అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేసుకుంటూ వచ్చారు. పంచాయతీ ఎన్నికలు రెండవ దశ పూర్తవుతున్న తరుణంలోనే వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ అభ్యర్ధులకు చేతినిండా పనిచెప్పింది. ఇదే సమయంలో అన్నిస్థానాల్లో అభ్యర్ధులు గెలుపొందడానికి అధిష్టానం ఇప్పటికే దిశానిర్ధేశం కూడా చేయడంతో ఎవరు పనుల్లో వారు బిజీబిజీగా ఓటర్లను ప్రశన్నం చేసుకుంటున్నారు. అధికారికంగా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మార్చి 10 నుంచి 14 వరకూ అధికారిక హడావిడి నెలకొననుంది..!