కోవిడ్ వేక్సినేషన్ త్వరగా పూర్తిచేయాలి..
Ens Balu
1
Vizianagaram
2021-02-16 13:21:58
మొదటి, రెండో విడత కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమంపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయితీ రాజ్, మున్సిపల్ సిబ్బందికి ప్రస్తుతం కోవిడ్-19 వేక్సినేషన్ జరుగుతోందన్నారు. తమ సిబ్బందికి వేక్సినేషన్ వేయించే బాధ్యతను ఆయా శాఖాధిపతులు తీసుకోవాలని, హెచ్ఓడిలకు ఉద్యోగుల జాబితాలను అందజేయాలని సూచించారు. ప్రతీ శాఖకూ నిర్ణీత సమయం, ప్రదేశాన్ని కేటాయించి, వారికి వేక్సిన్ వేయాలని, దానికి అనుగుణంగా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ నెల 18 నాటికి వేక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మాట్లాడుతూ కోవిడ్ వేక్సినేషన్‌పై మరింత ప్రచారం జరగాలని, సంబంధిత శాఖలకు ముందుగానే సమాచారాన్ని అందజేయాలని సూచించారు. తొలివిడతలో వైద్యారోగ్యసిబ్బంది 17,590 మంది పేర్లు నమోదు చేయగా, ఇప్పటివరకు 11,201 మందికి వేక్సిన్ వేయడం పూర్తయ్యిందన్నారు. రెండోవిడతలో రెవెన్యూ, పంచాయితీరాజ్ సిబ్బంది 21,432 మంది పేర్లు నమోదు చేయగా, వీరిలో ఇప్పటివరకు 6,499 మందికి వేక్సిన్ వేశారన్నారు. మున్సిపల్ సిబ్బంది 4169 మంది పేర్లు నమోదు చేయగా, 1,035 మందికి వేక్సినేషన్ జరిగిందని జెసి తెలిపారు.
సమావేశంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, డిపిఓ కె.సునీల్‌రాజ్‌కుమార్, సిపిఓ జె.విజయలక్ష్మి, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహన్, డిఐఓ డాక్టర్ నారాయణ, యుఎన్‌డిపి కన్సల్టెంట్ కమలాకర్, ఇంకా డాక్టర్ రవికుమార్, డాక్టర్ అశోక్ తదితర అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.