10న మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు..
Ens Balu
3
Vizianagaram
2021-02-16 17:38:02
విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను మార్చి 10 వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. ఈ నెల 17న జిల్లాలో జరిగే రెండోవిడత పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామన్నారు. జిల్లా ఎస్‌పి బి.రాజకుమారితో కలిసి మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయితీకి మార్చి 10న ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 13న రీపోలింగ్ నిర్వహిస్తామని, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. విజయనగరం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు, బొబ్బిలిలో 31 వార్డులు, పార్వతీపురంలో 30, సాలూరులో 29, నెల్లిమర్లలో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విజయనగరంలో 336, బొబ్బిలిలో 165, పార్వతీపురంలో 176, సాలూరులో 182, నెల్లిమర్లలో 108 నామినేషన్లు అర్హత పొందాయని, ఉప సంహరణకు మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలు వరకూ గడువు ఉందని చెప్పారు. ఈ ఎన్నికలకు విజయనగరంలో 196, బొబ్బిలిలో 62, పార్వతీపురంలో 49, సాలూరులో 49, నెల్లిమర్లలో 20, మొత్తం 376 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికకు 465 బ్యాలెట్ బాక్సులు, 81 మంది ఆర్ఓలు, ఓఆర్ఓలు, 441 మంది పిఓలు, 441 మంది ఏపిఓలు, 1393 మంది ఓపిఓలను వినియోగించనున్నట్లు చెప్పారు. ఛైర్‌పర్సన్, మేయర్ పదవులకు సంబంధించి విజయనగరం బిసి మహిళకు, బొబ్బిలి బిసీలకు, పార్వతీపురం బిసి మహిళకు, సాలూరు ఓసి మహిళకు, నెల్లిమర్ల ఎస్‌సి మహిళకు రిజర్వు అయినట్లు తెలిపారు. టార్గెట్-90 పేరుతో మున్సిపాల్టీల్లో అత్యధిక ఓటింగ్ జరిగేందుకు కృషి చేస్తామని కలెక్టర్ చెప్పారు.
ఫేజ్-3లో భాగంగా బుధవారం జరగనున్న రెండో విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విడతలో మొత్తం 248 గ్రామ పంచాయితీలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, కోర్టు ఆదేశాల ప్రకారం 4 పంచాతీలను మినహాయించి, 244 పంచాయితీలకు, 2330 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలను నిర్వహిస్తుండగా, వీటిలో 37 సర్పంచ్ పదవులు, 610 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఇవి పోగా 207 సర్పంచ్ పదవులు, 1720 వార్డులకు 17న ఎన్నికలు జరుగుతాయని, మొత్తం 3,60,181 మంది తమ ఓటుహక్కును వినియోగించనున్నారని తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 642 మంది, వార్డు మెంబరు పదవులకు 3791 మంది పోటీ పడుతున్నారని చెప్పారు. వీరికోసం 2,030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తొలివిడత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈ సారి కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. కౌంటింగ్‌ను సకాలంలో ప్రారంభించి, రాత్రి 10 గంటలకల్లా పూర్తి చేసేందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
ఎస్‌పి బి.రాజకుమారి మాట్లాడుతూ రెండోవిడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 207 పంచాయితీల్లో 62 సమస్యాత్మక ప్రాంతాలు, 46 అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సాయుధ దళాలను వినియోగించనున్నట్లు చెప్పారు. అలాగే 82 రూట్ మొబైల్ టీమ్స్, 80 స్ట్రైకింగ్ ఫోర్సెస్, మరో 80 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లోని 17,046 మందిని ఇప్పటివరకు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 7వేల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. 88వేల సారాయి ఊటలకు ద్వంసం చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక దళాలను వినియోగించనున్నట్లు ఎస్‌పి తెలిపారు.
విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, డిపిఓ కె.సునీల్ రాజ్‌కుమార్, సిపిఓ జె.విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు ఎస్ఎస్ వర్మ, ఎం.మల్లయ్యనాయుడు, కె.కనకమహాలక్ష్మి, కెవి రమణమూర్తి, పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.