ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతం..


Ens Balu
2
Srikakulam
2021-02-16 18:06:44

గ్రామ పంచాయతీ ఎన్నికలకు  బుధవారం జరగనున్న మూడవ దశ పోలింగుకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. మూడవ దశ ఎన్నికలు జరగనున్న ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, రేగిడి మండలాల ప్రధాన కేంద్రాలలో మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నుండి ప్రారంభించారు. మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం బూర్జతో పాటు పలు ప్రాంతాలను సందర్శించి పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అలాగే సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ఆమదాలవలసలతో పాటు పలు ప్రాంతాలను,  ఆర్.శ్రీరాములు నాయుడు పాలకొండలోని పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ దశ పోలింగుకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయిందని తెలిపారు. ఎన్నికలు జరగాల్సిన 9 మండలాలకు సామాగ్రి చేరుకుందని చెప్పారు. విధులకు హాజరు కావలసిన 9 మండలాల పోలింగు సిబ్బందికి మంగళవారం ఉదయం 5.00 గంటల నుండి ఆర్.టి.సి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇదేకాకుండా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామన్నారు. ఏకగ్రీవాలు మినహా మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలలో పోలింగు జరుగుతుందని ఆయన చెప్పారు. మద్యం దుకాణాలను కౌంటింగు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అభ్యర్ధులు ప్రచార కార్యక్రమాలను 44 గంటలు ముందుగా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసామని,  పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.