3వ దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం..


Ens Balu
3
Visakhapatnam
2021-02-16 18:25:48

విశాఖ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు  బుధవారం జరగనున్న మూడవ దశ పోలింగుకు సంబంధించి పాడేరు డివిజన్లో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న అనంతగిరి, అరకులోయ, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీ.కే.వీధి, కొయ్యూరు మండల కేంద్రాలలో  జాయింట్ కలెక్టర్ లు ఎమ్. వేణుగోపాలరావు, పి.అరుణ్ బాబు, ఆర్.గోవిందరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్.వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య   పర్యవేక్షణలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతంగా జరిగిందన్నారు.  మండల కేంద్రాలలో  ప్రత్యేక అధికారులు,  ఎంపీడీవోలు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారని చెప్పారు.  సంయుక్త కలెక్టర్  ఎం.వేణుగోపాలరావు పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలు,  పి.అరుణ్ బాబు అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్ ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలు, సంయుక్త కలెక్టర్ ఆర్.గోవిందరావు చింతపల్లి, జీకే వీధి మండలాల్లో, నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య కొయ్యూరు మండలాలను పర్యటించారని,  ఎన్నికలు జరగాల్సిన అన్ని మండలాలకు సామాగ్రి చేరుకుందని చెప్పారు. విధులకు హాజరు కావలసిన  పోలింగు సిబ్బందికి మంగళవారం ఉదయం 4.00 గంటల నుండి ఆర్.టి.సి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారికి సంబంధిత మండలాలకు పంపించామన్నారు. అంతేకాకుండా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామన్నారు. మద్యం దుకాణాలను కౌంటింగు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేయడం, అభ్యర్ధులు ప్రచార కార్యక్రమాలను 44 గంటలు ముందుగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసామని తెలిపారు. ఏజెన్సీ లో సమస్యాత్మక ప్రాంతాల్లో వ్యూహం తో  పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.