ఓట్లు లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి..
Ens Balu
2
Vizianagaram
2021-02-16 18:35:20
రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును సాయంత్రం 4 గంటలకు మొదలు పెట్టి, రాత్రి 10 గంటల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. బుధవారం జరగనున్నఎన్నికల ఏర్పాట్లపై, జిల్లా పరిషత్‌లోని కమాండ్ కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షించారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరినదీ లేనిదీ, పోలింగ్ సామగ్రి అందినదీ లేనిదీ, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూము సిబ్బందినుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి అయ్యేలా టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఉదయం 6 గంటలు నుంచి కమాండ్ కంట్రోల్ రూములో పర్యవేక్షణ మొదలుపెట్టాలన్నారు. నిర్ణీత సమయం ఉదయం 6.30కి పోలింగ్ ప్రారంభించేలా చూడటం, 7.30 నుంచి గంటగంటకూ పోలింగ్ శాతాన్ని సేకరించి, నివేదికలు తయారు చేయాలన్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్ ముగించి, 4 గంటలకల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభించేలా సిబ్బందిని సమాయత్తపరచాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేసి, వెంటనే ఎన్నికను నిర్వహింపజేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సిహెచ్ కిశోర్ కుమార్, డిపిఓ కె.సునీల్ రాజ్‌కుమార్, డిడిఓ కె.రామచంద్రరావు తదితరులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.
ఒమ్మి 4వ వార్డు ఎన్నిక వాయిదా
నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలోని 4వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. పేర్లు తారుమారు అయి, పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాలో ఉండాల్సిన పేరు ఉప సంహరణ జాబితాలో పొరపాటుగా నమోదు కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరిగిందన్నారు. ఈ వార్డులో సర్పంచ్ కు సంబంధించిన పోలింగ్ మాత్రం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.