181కు నిర్భయంగా ఫిర్యాదు చేయండి..


Ens Balu
3
Srikakulam
2021-02-16 21:46:17

శ్రీకాకుళం జిల్లాలోని మహిళల సమస్యల పరిష్కారం కోసమే సఖీ ( వన్ స్టాప్ సెంటర్ ) కేంద్రం కొనసాగుతుందని వన్ స్టాప్ సెంటర్ కార్యకర్త బి.కవిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక హడ్కోకాలనీలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో సఖీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ ఉందని, కావున మహిళలకు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 100, 181, 1098 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు. ముఖ్యంగా పోలీసు, వైద్య, న్యాయ, మహిళా శిశు సంక్షేమ విభాగాలతో పాటు ఇతర స్వచ్చంధ సంస్థలతో అనుసంధానమై 181 కాల్ సెంటర్ పనిచేస్తుందని, అలాగే బాలల రక్షణ కోసం 1098 పనిచేస్తుందని తెలిపారు. కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆమె చెప్పారు. మహిళల లైంగిక వేధింపులు, గృహహింస, బాల్యవివాహాలు, వరకట్న వేదింపులు, అక్రమ సంబంధాలు, ఈవ్ టీజింగ్, బెదిరింపులు, మహిళల అక్రమ రవాణా, సెల్ ఫోన్ ద్వారా జరిపే నేరాలు,మాదక ద్రవ్యాలకు లోనై హింసించడం, ఇంటి నుండి గెంటేయడం, పనిచేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు, తల్లితండ్రుల నిర్లక్ష్యానికి గురైనవారు 181 నెంబరుకు నిర్భయంగా కాల్ చేయవచ్చని ఆమె చెప్పారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖీ కేంద్రంలో సోషల్ మరియు లీగల్ కౌన్సిలర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు. అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ కన్వీనర్ హిమబిందు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.