3వ విడత ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు..


Ens Balu
2
అనంతపురం
2021-02-16 22:02:48

అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల్లో ఈనెల 17వ తేదీన బుధవారం నిర్వహించే మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఉదయం  అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, తహశీల్దార్ లు, ఎన్నికల సిబ్బందితో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ను ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మెన్ అండ్ మెటీరియల్ సిద్ధం చేయాలని, మెటీరియల్ ను అందరికీ త్వరితగతిన అందజేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ముందుగానే చూసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వారు త్వరగా చేరుకునేలా చూడాలని, ఎన్నికల సిబ్బందికి, మెటీరియల్ తరలింపునకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బందికి  భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. బుధవారం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కూడా సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.