మున్సిపల్ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి..
Ens Balu
2
Kakinada
2021-02-16 22:08:24
తూర్పుగోదావరి జిల్లాలో ఏడు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీల్లో మార్చి 10వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఎన్నికలు జరగనున్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై రంపచోడవరం నుంచి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సన్నద్ధత పరంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడు పురపాలక సంఘాలతో పాటు ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. గతేడాది మార్చిలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ మళ్లీ ఈ ఏడాది మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంతో మొదలుకానుందని వివరించారు. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. మార్చి 10న పోలింగ్, మార్చి 14న కౌంటింగ్ ఉంటుందన్నారు. గతంలో దాఖలైన నామినేషన్ల నివేదికలను క్షుణ్నంగా పరిశీలించాలని.. ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి లోటుపాట్లు ఏవైనా ఉంటే సరిదిద్ది ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. అవసరం మేరకు పోలింగ్ కేంద్రాల మార్పుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ పరంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, పూర్తిచేయాలన్నారు. గతంలో నియమించిన ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి, అదనపు ఎన్నికల అధికారి వంటి ప్రత్యేక ఎన్నికల అధికారుల వివరాలను ప్రస్తుతం మరోసారి సరిచూసుకొని.. ఎవరైనా రిటైర్/బదిలీ అయితే వారి స్థానాల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించాలని.. గతంలో గుర్తించిన రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను మరోసారి క్షుణ్నగా పరిశీలించాలని సూచించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాలెట్ పెట్టెలు తీసుకోవాల్సి వచ్చిందని.. ఈసారి ఆ అవసరం లేదని, జెడ్‌పీ కార్యాలయం నుంచి బ్యాలెట్ పెట్టెలు అందుబాటులో ఉంటాయన్నారు. అవసరమైన 448 పెద్ద బ్యాలెట్ పెట్టెలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశానికి తూర్పుగోదావరి మునిసిపల్ ఎన్నికల నోడల్ అధికారి, కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, మెప్మా పీడీ కె.శ్రీరమణి, ఎన్ఐసీ అధికారి సుబ్బారావు, పదిమంది కమిషనర్లు తదితరులు హాజరయ్యారు.