సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతం..
Ens Balu
1
Srikakulam
2021-02-17 15:33:51
శ్రీకాకుళం జిల్లాలో మూడవ విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పోలింగ్ సరళిని పరిశీలించిన జె.సి ఆమదాలవలస మండలం తోగరాంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలోని 9 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతీ కేంద్రంలో సాఫీగా జరుగుతున్నట్లు వివరించారు. గడచిన రెండు దశల్లో ఓటర్లు వలసలు వెళ్లిపోవడంతో 78 శాతం వరకే పోలింగ్ నమోదైందని, ప్రస్తుతం ప్రతీ కేంద్రంలో 85 శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో కూడా గడచిన రెండు దశల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ప్రస్తుతం మూడవ దశలో కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు తెలిపారు. వి.ఆర్.ఓ, గ్రామ కార్యదర్శిల ద్వారా గ్రామాల్లో ఓటు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తిన తక్షణమే పరిష్కారం అయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేశామని జె.సి చెప్పారు.