కౌంటింగ్ కేంద్రంలో ప‌టిష్ట ఏర్పాట్లు చేయాలి..


Ens Balu
3
కాకినాడ
2021-02-17 17:40:37

తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గానికి మార్చి 14న పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో స‌న్న‌ద్ధ‌తా చ‌ర్య‌ల్లో భాగంగా కౌంటింగ్ ప్ర‌క్రియకు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి కాకినాడ‌లోని జేఎన్‌టీయూను సంద‌ర్శించి, అక్క‌డి కౌంటింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్ల‌పై అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. మార్చి 17న జ‌రిగే ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ స‌జావుగా సాగేందుకు త‌గిన‌న్ని టేబుళ్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. కౌంటింగ్ సిబ్బందికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద గ‌ట్టి భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని పోలీసు అధికారుల‌కు సూచించారు. విద్యుత్ సౌక‌ర్యానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల‌న్నారు. క‌లెక్ట‌ర్ వెంట అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ స‌త్తిబాబు, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ త‌దిత‌రులు ఉన్నారు.