అనంత డివిజన్ లో 8.98% పోలింగ్..


Ens Balu
2
Anantapur
2021-02-17 18:00:07

అనంతపురం జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 80.29 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధి నందు ఉన్న 19 మండలాలలోని 355 గ్రామ పంచాయతీలలో, 2619 వార్డులలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.  పెద్ద వడుగూరు మండలం రావులుడికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మరణించినందు వల్ల అక్కడ ఓటింగ్ జరగలేదని, అందువల్ల పోలింగ్ జరగాల్సిన గ్రామ పంచాయతీల సంఖ్య 356 నుండి 355 కు సంఖ్య తగ్గిందని తెలిపారు. అలాగే ఉరవకొండ గ్రామ పంచాయతీ మూడో వార్డు ఎన్నికలకు సంబంధించి పోటీ నుంచి తప్పుకున్న ఒక వ్యక్తికి గౌను గుర్తు కేటాయించి బ్యాలెట్ పేపర్లను ముద్రించడంతో వాయిదా అనివార్యమైందన్నారు. ప్రస్తుతం ముద్రించిన బ్యాలెట్ పేపర్లోని గౌను గుర్తు లేకుండా తిరిగి కొత్త బ్యాలెట్ పేపర్లను ముద్రించి ఫిబ్రవరి 21న జరగనున్న నాలుగో విడత ఎన్నికలలో మూడో వార్డుకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అందువల్ల పోలింగ్ జరగాల్సిన వార్డుల సంఖ్య 2620 నుండి 2619 కు సంఖ్య తగ్గిందని తెలిపారు. బుధవారం ఉదయం 6:30 గంటలకు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలు కాగా, ఉదయం 7:30 గంటలకు అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల పరిధిలో 5.13 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 8:30 గంటలకు 15.14 శాతం, 9:30 గంటలకు 32.21 శాతం, 10:30 గంటలకు 48.15 శాతం, 11:30 గంటలకు 61.25 శాతం, మధ్యాహ్నం 12:30 గంటలకు 70.23 శాతం, 1:30 గంటలకు 75.58 శాతం, 2:30 గంటలకు 78.32 శాతం, 3:30 గంటలకు 80.29 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇందులో 6,03,927 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.  ప్రశాంతంగా మూడవ విడత పోలింగ్ :  జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల పరిధిలో జరిగిన మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ సజావుగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సాఫీగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకోవడం, ఎన్నికల అధికారులకు, సిబ్బందికి, ఓటర్లకు అవసరమైన అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించడంతో మూడవ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగిందన్నారు.  మూడవ విడత పోలింగ్ విజయవంతంపై ఎన్నికల అధికారులకు, పోలీస్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు :  ఈ సందర్భంగా మూడవ విడతలో అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం పట్ల ఎన్నికల అధికారులు, సిబ్బందికి, పటిష్టమైన బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి, మండల, డివిజనల్, జిల్లా స్థాయి ఎన్నికల సిబ్బంది కి, నోడల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన ఎన్నికల విజయవంతంకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పనిచేశారని జిల్లా కలెక్టర్ అభినందించారు. మూడవ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, జిల్లాలో మరో దశలో పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరగనున్న పోలింగ్ ను కూడా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.