విజయనగరం లోనే అత్యధిక శాతం పోలింగ్..
Ens Balu
2
Vizianagaram
2021-02-17 19:48:33
ఫేజ్-3 ఎన్నికల్లో విజయనగరం జిల్లా చరిత్ర సృష్టించింది. జిల్లాలో బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో, రాష్ట్రంలోనే అత్యధికంగా 87.09 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లాలో రెండో విడత ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా స్వల్ప సంఘటనలు మినహా, ప్రశాంతంగా పూర్తయ్యాయి. అత్యధిక శాతం ఓటింగ్ నమోదు చేయడం ద్వారా విజయనగరం జిల్లా రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచింది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో ఈ విడత ఎన్నికలు జరిగాయి. మొత్తం 244 పంచాయితీలకు, 2330 వార్డులకు ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో 37 సర్పంచ్ పదవులు, 610 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోగా 207 సర్పంచ్ పదవులు, 1719 వార్డులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలోని 4వ వార్డు ఎన్నికను సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. ఎన్నికల కోసం డివిజన్ పరిధిలో 2,030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నిర్ణీత సమయం ఉదయం 6.30కే రెండోవిడత పోలింగ్ ప్రారంభమయ్యింది. అప్పటినుంచే ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యూలైన్లలో బారులు తీరారు. పలుచోట్ల వృద్దులు, వికలాంగులు సైతం ఓటేయడానికి పోటీ పడ్డారు. ఉదయం 8.30 గంటలకు 15.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, అక్కడినుంచి ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఉదయం 10.30 గంటలకు ఓటింగ్ శాతం 50.70కు చేరుకుంది. ఆ తరువాత కూడా ఓటర్లలో అదే ఉత్సాహం కొనసాగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు 78.50 శాతం నమోదయ్యింది. ఆ తరువాత కాస్త నెమ్మదిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు 84.60 శాతం నమోదు కాగా, ఓటింగ్ ముగిసేటప్పటికి 87.09 శాతానికి చేరుకొని, జిల్లా చరిత్ర సృష్టించింది. అక్కడక్కడా స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పిలు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో ప్రక్రియ సజావుగా పూర్తయ్యింది. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా ఓట్ల లెక్కింపు కూడా సకాలంలో మొదలయ్యింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఉదయం 6 గంటలు నుంచే కమాండ్ కంట్రోల్ రూము ద్వారా ఎన్నికలను పర్యవేక్షించారు. జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సిహెచ్. కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్క్షే, నియోజక వర్గాల ప్రత్యేకాధికారులు, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల అధికారులకు, సిబ్బంది కి ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయడం ద్వారా ప్రశాంతంగా ఎన్నికలను పూర్తి చేశారు.
జిల్లా యంత్రాంగానికి అభినందనలు ః కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్
జిల్లాలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడంతోపాటుగా, అత్యధిక శాతం ఓటింగ్‌ను నమోదు అవ్వడానికి కారణమైన ఎన్నికల అధికారులను, సిబ్బందిని, పోలీసు శాఖను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సహకరించిన జిల్లా ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.