ఆఖరి విడత ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు..
Ens Balu
2
Kakinada
2021-02-18 12:19:26
తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 21వ తేదీన చివరి విడతలో అమలాపురం డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మండల, డివిజనల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి తదితరులతో కలిసి కలెక్టర్.. వర్చువల్ విధానంలో అమలాపురం డివిజన్ గ్రామ పంచాయతీ ఎన్నికలపై జిల్లా, డివిజన్, 16 మండలాల ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను చూస్తే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగినా.. కౌంటింగ్ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతోందని.. ఈసారి అలా కాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. సరైన సమయానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా చూడాలని, కౌంటింగ్‌కు అవసరమైనన్ని టేబుళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులతో పాటు ఇతర ఎన్నికల సామగ్రికి కొరత లేకుండా చూసుకోవాలని, కోవిడ్-19 జాగ్రత్తలకు అవసరమైన థర్మల్ స్కానర్లు, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సెన్సిటివ్ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు పంపేలా ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా దాదాపు 20 శాతం రిజర్వ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకొని గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రవాణా, ఆహారం, వసతి పరమైన ఏర్పాట్లలో లోటు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.