అరసవెల్లిలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
2
Arasavilli
2021-02-18 16:11:14
అరవెల్లిలోని శ్రీ సూర్య నారాయణస్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. రథ సప్తమి ఏర్పాట్లను 18వ తేదీ ఉదయం పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి గురు వారం పరిశీలించారు. 80 ఫీట్ రహదారి వద్ద వాహనాల పార్కింగు స్ధలాన్ని పరిశీలించిన కలెక్టర్ , ఎస్.పి పి.స్.ఎన్.ఎం మిల్లు జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం దిశగా వెళ్ళునపుడు ఎడమ చేతి వైపు ఆటోలు, బస్సులు, కార్లు పార్కింగు చేయాలని, కుడి వైపున ద్విచక్ర వాహనాలు పార్కింగు చేయాలని సూచించారు. వి.వి.ఐ.పి కార్లను సన్ రైజ్ హోటల్ వరకు అనుమతించి అచ్చట నుండి ప్రోటోకాల్ వాహనంలో ఆలయం వరకు వి.వి.ఐ.పిలను దర్శనానికి తీసుకువెళ్ళడం జరుగుతుందని పేర్కొన్నారు. వి.ఐ.పిలు విధిగా పాస్ ను కలిగి ఉండాలని, పాస్ లు లేని వారిని అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేసారు. పాస్ లకు ముందుగా వివరాలను ఆర్.డి.ఓకు సమర్పించాలని సూచించామని, ఆ మేరకు వివరాలు వచ్చాయని చెప్పారు. వంద రూపాయలు, ఉచిత దర్శనం క్యూ లైన్సు ఇంద్ర పుష్కరిణి గుండా వెళుతుందని తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 10 గంటల వరకు వారికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. డిసిఎంఎస్ తోట వద్ద నుండి 5 వందల రూపాయల టికెట్ లైన్ ప్రారంభం అవుతుందని అన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించాలి : శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు గురు వారం రాత్రి 12 గంటల నుండి ప్రారంభం అవుతుందని కలెక్టర్ అన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ వ్యాప్తి భారీన త్వరగా పడే ముప్పు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు వంటి వారు దర్శనానికి రాకుండా ఇంటి వద్ద ఉండుటకు ప్రయత్నించాలని సూచించారు.
సాధారణ భక్తులు సైతం ప్రశాతంగా, చక్కటి దర్శనాన్ని పొందుటకు అన్ని ఏర్పాట్లు చేసామని, భక్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ కోరారు. పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ రథ సప్తమి వేడుకలకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్వామి వారి దర్శనం కావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, డి.ఎస్.పి ఎం.మహేంద్ర, ఎన్.ఎస్.ఎస్.శేఖర్, శ్రీనివాస రావు, సి.హెచ్.శ్రీనివాస రావు., నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, ఆలయ ఇ.ఓ వి.హరి సూర్యప్రకాష్, తహశీల్దార్ వై.ఎస్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.