మున్సిపల్ ఎన్నికలు బాగా నిర్వహించాలి..


Ens Balu
3
Anantapur
2021-02-18 19:13:36

అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, అంతకన్నా బాగా మున్సిపల్ ,అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను  నిర్వహించాలని, ఇందుకోసం అన్ని విధాలుగా సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, మున్సిపల్ ఆర్ డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ మరియు అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను సజావుగా, సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రణాళిక రూపొందించుకొని మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని, పొరపాటున కూడా ఎలాంటి తప్పులు జరగడానికి వీలు లేదన్నారు. సమయం వృధా చేయకుండా ఎన్నికల పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలి :  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీలోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కంట్రోల్ రూమ్ లోనూ అవసరమైన సిబ్బందిని నియమించాలని, అందుకు సంబంధించి సిబ్బంది నియామకం వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు.  మున్సిపల్ ఎన్నికల కోసం స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించడం, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్, రిటర్నింగ్ అధికారుల జాబితా, మోడల్ కోడ్ కండెక్ట్ టీం ఏర్పాటు, నోడల్ అధికారుల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాల వివరాలను 19వ తేదీ లోపు సిద్ధం చేయాలన్నారు. అనంతరం 20వ తేదీ నుంచి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించడం 20 నుంచి 28వతేదీలోపు చేయాలని, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు.  బ్యాలెట్ బాక్స్ ల తరలింపు, మొదటి, రెండో విడత పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఎన్నికల మెటీరియల్ అందజేయడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా, బ్యాలెట్ పేపర్ ప్రొక్యూర్ మెంట్, పోలింగ్ కౌంటింగ్ ఏర్పాట్లు అన్ని నిర్దేశిత సమయం లోపు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.  మున్సిపల్ ఎన్నికల కోసం ఇంతకుముందు గుర్తించిన పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల వసతులు ఉన్నాయా లేదా అని మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని, అవసరమైన పోలింగ్ స్టేషన్లలో తగిన వసతులు కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని, ఒక్కో టీం కు ఎన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలో నిర్ణయించాలని, రెండు రోజుల్లో అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలించి వాటిలో సౌకర్యాల కల్పన కోసం చర్యలు తీసుకోవాలన్నారు.  అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి, రెండవ, మూడవ విడత ఎన్నికలను సజావుగా నిర్వహించడం పట్ల నోడల్ అధికారులకు, ఆర్డీవోలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు జరగడం ఇంతకుముందు ఎప్పుడూ లేదని, ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల మెటీరియల్ ను ఎన్నికల సిబ్బంది కూర్చున్న దగ్గరికి అందించడం, ఎన్నికల సిబ్బందికి పారితోషికాన్ని వారి అకౌంట్ లోకి జమ చేయడం, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలను రప్పించి వారు పోలింగ్లో పాల్గొనేలా చేయడం, ఓటర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ, క్యాండిడేట్ ఫ్రెండ్లీ, ఎలక్షన్ అఫీషియల్ ఫ్రెండ్లీ గా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేశామన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికలను కూడా విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సత్య సాయిబాబా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని, పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా ఎన్నికల సిబ్బంది, పోలీసులు సమన్వయం చేసుకొని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల నియామకం దగ్గర సమస్యలు రాకుండా చూసుకోవాలని, రౌడీ షీటర్ లను పోలింగ్ ఏజెంట్ గా నియమించకుండా చూడాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను వివరించారు.  ఈ సమీక్ష సమావేశంలో సి పి ఓ ప్రేమ చంద్ర, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ  సుబ్బరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, పరిశ్రమల శాఖ జిఎం సుదర్శన్ బాబు, ఆర్ డి వో లు గుణభూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్, రామ్మోహన్, నగర పాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.