అన్నివార్డుల్లో ఒకేసారి లెక్కింపు జరగాలి..


Ens Balu
2
Anantapur
2021-02-18 20:07:52

అనంతపురం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల కౌంటింగ్ ఒకేసారి మొదలు కావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. గురవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు  కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని ఎన్ఐసీ భవనం నుంచి నాలుగో దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే పూర్తయిన మూడు దశల గ్రామ పంచాయితీ ఎన్నికలలో అక్కడక్కడా నెలకొన్న చిన్న చిన్న సమస్యలు పెనుకొండ డివిజన్ లో జరగనున్న ఆఖరి దశ ఎన్నికలలో పునరావృతం కాకుండా ఉండాలంటే అనుసరించాల్సిన కార్యాచరణపై మాట్లాడారు. ముందుగా పోలింగ్ సమాచారం ప్రతి గంటకోసారి ఆలస్యం కాకుండా అందించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని తెలిపారు. ఉదయం 6:30 గంటలకు పోలింగ్ మొదలయినప్పటి నుంచి ప్రతి గంటకూ సంబంధించిన పోలింగ్ రిపోర్టు పది నిమిషాల తేడాతో తనకు చేరాలని ఆదేశించారు. పోలింగ్ రిపోర్టు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఎంపీడీవోలు నియమించుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు తొందరగా పూర్తిచేయాలని ఆదేశిస్తూ పోలింగ్ అధికారులకు టైమ్ లైన్ ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ పూర్తయితే పది నిమిషాలలో వార్డుల కౌంటింగ్ మొదలవ్వాలన్నారు. సాయంత్రం 8:00 గంటలకు వార్డు మెంబర్లు, సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ పూర్తవ్వాలన్నారు.  కౌంటింగ్ చేసేటప్పుడు ఒక వార్డు తర్వాత మరో వార్డు లెక్కపెట్టడం సరికాదన్నారు. అన్ని వార్డుల ఓట్లు ఒకేసారి లెక్కపెట్టాలన్నారు. అన్ని వార్డు ఓట్లను ఒకేసారి కౌంటింగ్ చేసేందుకు అనుగుణంగా ఉండేలా పెద్ద హాలు, సరిపడినన్ని బెంచీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వార్డుల ఓట్లతో పాటూ సర్పంచు ఓట్లను కూడా ఏకకాలంలో కౌంటింగ్ చేయాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడి చేసి, అప్పటికప్పుడు ఉప సర్పంచు ఎన్నిక కార్యక్రమం నిర్వహించి, గెలిచిన వారికి ధ్రువ పత్రాలు కూడా అక్కడే జారీ చేయాలన్నారు. రీకౌంటింగ్ నిబంధనల గురించి ఆర్వోలు క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి రీకౌంటింగ్ నిర్వహించకూడదన్నారు.. ఈ అంశంలో ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. కౌంటింగ్ హాలులో పోలింగ్ అధికారులు, నిబంధనల ప్రకారం అనుమతించదగిన వ్యక్తులు తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నారు. పోలీసులు కూడా ఆర్వోలు కోరితేనే కౌంటింగ్ హాలులోకి ప్రవేశించాలన్నారు. అనుమతించని వ్యక్తులు ఎవరైనా కౌంటింగ్ హాలులో వుండకూడదన్నారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టరుతో పాటు జాయింట్ కలెక్టర్లు ఏ.సిరి & గంగాధర్ గౌడ్, జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, ఎన్నికల సలహాదారులు గోవిందరాజులు, డీపీవో పార్వతి, జడ్పీ సిఈవో శోభా స్వరూపా రాణి పాల్గొన్నారు. పెనుగొండ నుంచి సబ్ కలెక్టర్ నిశాంతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.