అంగరంగ వైభవంగా సూర్యజయంతి..


Ens Balu
2
Arasavilli
2021-02-19 11:37:01

 రథసప్తమి సందర్భంగా అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం అర్ధరాత్రి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి తొలి క్షీరాభిషేకాన్ని చేసి స్వామి వారి జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్ కు పంచామృతాలు, క్షీరంతో అభిషేకాలు చేసారు. ఆలయ సంప్రదాయంలో భాగంగా  దేవాదాయ శాఖ డెప్యూటీ కమీషనర్ ఎన్.సుజాత, ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి ఛైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావు, పాలకమండలి సభ్యులు ఉత్సవ అధికారికి తొలుత స్వాగతం పలికారు.  ఆలయ నియమాల మేరకు దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు భ్రమరాంబ, ఆలయ కార్యనిర్వహణ అధికారి  రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి వారు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు వదిలి నిజరూపంలో భక్తులకు దర్మనమిచ్చారు. ఈ వేడుకలతో  అరసవల్లి ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామి వారి నిజరూప దర్శనం కొరకు భక్తులు వేల సంఖ్యలో పోటేత్తారు.