నాడు-నేడు లో విజయనగరమే నెంబర్ 1 కావాలి..
Ens Balu
3
Vizianagaram
2021-02-19 14:21:43
విద్యారంగలో ఎలాంటి మార్పు అయినా మన జిల్లా నుంచే మొదలవ్వాలని.. నూతన విధనాలను స్వాగతించడం ద్వారా అద్భుత ఫలితాలను చవిచూడాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకం అమల్లో జిల్లా నెం.1 స్థానంలో నిలవాలని పేర్కొన్నారు. ఆరోగ్య కరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించాలని సూచించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అమలు చేస్తున్న పలు విద్యా పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అందించాలని దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ అన్నారు. ప్రతి పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం-పరిరక్షణ, పరిపూర్ణ ఆరోగ్య సూత్రాలను పాటించాలని సూచించారు. విధిగా ప్రతి పాఠశాలలో మొక్కలను నాటి సంరక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనంలో నాణ్యత ఉండాలని, మంచి ఆహారం అందించాలని చెప్పారు. మెనూ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి ఉపాధ్యాయుడూ బాధ్యతగా మెలగాలని విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని ఉపదేశించారు. ఉపాధ్యాయుల మేథస్సు సమాజ అభివృద్ధికి దోహదపడాలని, స్థానికంగా ఉండే చెరువులను సంరక్షించుకోవాలని సూచించారు. పిల్లల చేత వారి తల్లిదండ్రులను ప్రోత్సహించటం ద్వారా పాఠశాలల్లో, గ్రామాల్లో మొక్కలు నాటాలని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కువ చెరువులు కలిగిన జిల్లా మనదని, వాటిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పరీక్షలకు ఇప్పటి నుంచే తర్ఫీదు ఇవ్వండి
మారిన నూతన పరీక్ష విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కొత్త విధానాలు అమలు చేయటం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ఇప్పటి నుంచే విద్యార్థులకు తగిన తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశించారు. దీనికి మెరుగైన ప్రణాళికలు రచించి ఆచరించాలని, ఆశాజనక ఫలితాలను సాధించాలని చెప్పారు. విద్యారంగంలో ఎలాంటి మార్పుకైనా విజయనగరం జిల్లాయే నాంది పలకాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోవిడ్-19పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, నివారణ మార్గాలను సూచించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రతి ఉపాధ్యాయుడూ బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం సంయక్త కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇంకా పూర్తికాని నాడు-నేడు పనులను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల పనులను త్వరితగతిన ముగించాలని చెప్పారు. ఎలాంటి కొత్త పనులూ ప్రారంభించవద్దని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాత పనులనే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడూ విధిగా ఈ-హాజరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అందులో హాజరు నమోదు చేయాలని సూచించారు.
సమావేశంలో డీఈవో జి.నాగమణి, పలు ఉన్నత పాఠశాలల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సత్కారం
పదోన్నతి పొందిన కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్‌కు ఈ సందర్భంగా డీఈవో, డిప్యూడీ డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. కరతాల ధ్వనులతో అభినందనలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. పూలమాలలు, శాలువాలు వేసి సత్కరించారు. పలువురు ఉపాధ్యాయులు, కలెక్టరేట్ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేశారు.