పారదర్శకంగా 4వ విడత ఎన్నికల నిర్వహణ..


Ens Balu
2
Visakhapatnam
2021-02-19 18:24:17

నాల్గవ విడత గా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్  పగడ్బందీగా, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ లోని ఆరు మండలాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత వరకు జరిగిన మూడు విడతలను విజయవంతంగా నిర్వహించామన్నారు.  అప్పటికంటే ఈసారి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ   సమిష్టిగా సమన్వయంతో పని చేసినట్లైతే జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ముగుస్తాయన్నారు.  పోలింగ్ అధికారులు ఎన్నికలు నిర్వహించే క్రమంలో  గ్రామంలో ఎవరితో కూడా మాట్లాడ రాదన్నారు.  ఎన్నికల నిర్వహణ,  పై అధికారులకు రిపోర్టులు సమర్పించడంలో, ఆదేశాలను పెడచెవిన పెట్టినట్లయిన తీవ్ర చర్యలు తప్పవన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు కు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రణాళిక ప్రకారం ముందస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమస్యాత్మక   కేంద్రాలలో ఓట్ల లెక్కింపును తప్పక వీడియోగ్రఫీ చేయించాలన్నారు.  సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్,  సీసీ కెమెరాలు వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  పాల్గొనే సిబ్బంది అందరికీ మంచి భోజనం, అల్పాహారం సరఫరా చేయాలన్నారు. పోలింగ్ కౌంటింగ్ లను గూర్చిన రిపోర్టులు ఎప్పటికప్పుడు వేగంగా స్పష్టంగా కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు.  అన్ని రిపోర్టుల పై  సంతకం తప్పనిసరిగా ఉండాలని, పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తెలియజేయాలని  ఆదేశించారు.  లెక్కింపు చేసేటప్పుడు వేగంగా కచ్చితత్వంతో చేయాలన్నారు. రీకౌంటింగ్ చేయవలసి వస్తే నియమ నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్యూటీ వివరాలు తెలిపే ప్రత్యేక యాప్.. మన జిల్లాలో ఎన్నికల సిబ్బంది తాము పని చేయవలసిన కేంద్రం గూర్చి తెలుసు  కునేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) వారు ప్రత్యేక యాప్ ను రూపొందించారని కలెక్టర్  తెలియజేశారు. పోల్ పార్టీ కోడ్ ను సదరు యాప్ లో ఎంటర్ చేయగానే తాము ఏ గ్రామానికి కేటాయించబడింది తెలుస్తుందని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్   ఆర్. గోవిందరావు, జిల్లా పరిషత్ సీఈవో నాగార్జునసాగర్  , డి ఆర్ డి ఏ   పి డి  వి.విశ్వేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి పాల్గొనగా  జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.