ఆఖరి దశ ఎన్నికల్లో ఉత్సాహంగా నిర్వహించాలి..
Ens Balu
3
Vizianagaram
2021-02-19 19:02:11
విజయనగరం జిల్లాలో ఈ నెల 21న జరగనున్న ఆఖరి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికారులంతా ఉత్సాహంగా పాల్గొనాలని.. ప్రశాంత ఎన్నిక నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. 17వ తారీఖున జరిగిన మూడో దశ ఎన్నికల మాదిరిగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని, నాడు పాటించిన పంథానే కొనసాగించాలని సూచించారు. తప్పులు, పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులంతా సమన్వయంతో వ్యవహరించి ఎన్నిక ప్రక్రియను, లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 21న బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, జామి, కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట, మెంటాడ, వేపాడ మండలాల పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించేందుకు ఆయా మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి మండల కేంద్రంలో సహాయ కేంద్రాన్ని, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసుకొని ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. ఎన్నికల విధులకు ఎవరూ గైర్హాజరు కావడానికి వీలులేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇటీవల జరిగిన రెండు దశల ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులకు కాస్త వెసులు బాటు ఇవ్వాలని ఆయా మండలాల ఆర్వోలకు సూచించారు. ఆయా ఆర్వోలు విచక్షణా అధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకోవచ్చని, ఒక వేళ సిబ్బంది తగినంత మంది అందుబాటులో ఉంటే ఇది వరకు రెండు దశల్లో పనిచేసిన సిబ్బందిని రిజర్వులో ఉంచుకోవచ్చని చెప్పారు. అలాగే సిబ్బందికి భోజన వసతి తప్పకుండా కల్పించాలని, సిబ్బంది తరలింపు విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.
ఎన్నికల నిబంధలన ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలవ్వాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బాక్సులకు సీల్ వేసి, 4.00 గంటలకి లెక్కింపు మొదలు పెట్టేయాలని, రాత్రి 10.00 గంటల లోపు ఫలితాలు వెల్లడించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి కంట్రోల్ రూమ్‌కు నివేదించాలని సూచించారు. ఎన్నిక ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియను త్వరగా సజావుగా నిర్వహించేలా ఆయా ఆర్వోలు తగిన ముందస్తు ప్రణాళిక రచించుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాత్రి 10.00 గంటలకు లోపే ఫలితాలను అందజేయాలని చెప్పారు. గంట గంటకు పోలింగ్ శాతాన్ని జిల్లాపరిషత్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని ఆర్వోలను ఆదేశించారు. ఎన్నిక రోజంతా కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జేసీ మహేష్ కుమార్ అందుబాటులో ఉంటారని, ఎన్నిక ప్రక్రియను పరిశీలిస్తారని తెలిపారు. అలాగే ఎలాంటి సమస్య వచ్చినా సొంత నిర్ణయాలు తీసుకోకుండా తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలీసుల సహకారం తీసుకోవాలని, పరిస్థితి చేయిదాటకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. గొడవలు జరగకుండా చూసుకోవాలని, వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
మళ్లీ మళ్లీ కౌంటింగ్ వద్దు...
జేసీ కిశోర్ కుమార్ మాట్లాడుతూ పలు కేంద్రాల్లో ఫలితాల వెల్లడి ఆలస్యం కావడానికి రీ కౌంటింగ్ కారణంగా కనబడుతుందని, ఎన్నికల నిబంధనలను అనుసరించి దీన్ని పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం సింగిల్ డిజిట్‌లో ఓట్లు తేడా వస్తేనే రీ కౌంటింగ్ చేయాలని, ఒక వేళ డబుల్ డిజిట్‌లో ఓట్లు తేడా వస్తే రీ కౌంటింగ్ చేపట్టనవసరం లేదని పేర్కొన్నారు. ఒక వేళ రీ కౌంటింగ్ చేయాల్సి వస్తే ఒక సారి మాత్రమే అలా చేయాలని, మళ్లీ మళ్లీ రీ కౌంటింగ్ చేయవద్దని జేసీ స్పష్టం చేశారు. అధికారులు ఓర్పుతో సహనంతో వ్యవహరించాలని సూచించారు.
సమావేశంలో డీపీవో సునీల్ రాజ్ కుమార్, సీపీవో విజయలక్ష్మి, డీఎల్‌డీవో రామచంద్రరావు, పలువురు ప్రత్యేక ఉప కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
1.30 గంటలకే పోలింగ్ ముగిసే కేంద్రాలు
ఈ దఫా ఎన్నికల్లో నాలుగు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ధారపర్తి, లోతుగెడ్డ, కూనేరు, కొండలింగాల వలస గ్రామాల్లో పోలింగ్ మధ్యాహ్నం 1.30 గంటల వరకే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో 2.00 గంటలకే లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు.
21న ఒమ్మి పంచాయతీలో వార్డుకు ఎన్నిక
ఈ నెల 17వ తేదీన సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి పంచాయతీలో నాలుగో వార్డు ఎన్నిక ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ స్పష్టం చేశారు. దానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.