తుది ఎన్నికలకు సర్వం సిద్ధం..


Ens Balu
1
Srikakulam
2021-02-20 17:37:35

శ్రీకాకుళం  జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) ఆర్.శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు.  శ్రీకాకుళం రూరల్ మండలం పంచాయతీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన జె.సి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలంలోని 23 పంచాయతీలకు, 240 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుందని చెప్పారు. పోలింగ్ కు సంబందించిన మెటీరియల్ పూర్తిగా పంపిణీ అయ్యిందని, 600 మంది సిబ్బంది ఈ పోలింగ్ కు హాజరుకానున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని వివరించారు. తుది విడత పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉదయం 6.30 గం.ల నుండి మధ్యాహ్నం 3.30 గం.ల వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తదుపరి కౌంటింగ్ జరిగేలా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రతీ కేంద్రంలో రాత్రి 10.00 గం. లకే కౌంటింగ్ ముగిసేలా ఆదేశాలు జారిచేసామని జె.సి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.